గుడ్ బై..: షీలా దీక్షిత్
గుడ్ బై..: షీలా దీక్షిత్
Published Sun, Dec 8 2013 11:39 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన షీలాదీక్షిత్‌కు ఘోర పరాభం ఎదురైంది. విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపించిన ఆమెకే ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన ఈ దుస్థితికి ఆ పార్టీ నేతలందరూ కారణమైనప్పటికీ ఓటమిని షీలా హుందాగా అంగీకరించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉండడాన్ని గమనించిన షీలాదీక్షిత్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆమె విలేఖరులతో మాట్లాడూతూ ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతునిచ్చినందుకు ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
గెలుపోటములను విశ్లేషిస్తూ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఆమె నిరాకరించారు. వాటికి తరువాత సమాధానమిస్తానంటూ దాటవేశారు. అయితే ఓటర్ల మూడ్ ను కనిపెట్టడంలో విఫలమయాృరా అన్న ప్రశ్నకు మాత్రం కాస్త అసహనంగా, మరికొంత వెటకారంగా.. ‘బేవకూఫ్‌హూనా’ ( తెలివితక్కువదాన్ని కదా) అని జవాబిచ్చి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నిజానికి ప్రచారానికి పార్టీ పెద్దలు ముఖం చాటేసినా, స్థానిక నాయకులే సహకరించకపోయినా ఆమె తన లక్ష్యంవైపే పయనించారు. పార్టీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశారు.
దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తిప్రతిష్టలు మూటగట్టుకున్న ఆమెకు కేంద్రంలో పార్టీ అవలంబిస్తున్న విధానాలు కూడా ప్రతికూలంగా మారాయి. ఎన్నికల బాధ్యతను పూర్తిగా ఆమె భుజాలపైకే నెట్టడం, దీర్ఘకాలంగా ఆమెకే ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తుండడంతో అవకాశం రాని స్థానిక నేతలు సహకరించకపోవడం వంటివే రాజధానిలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. వీటికి తోడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రత్యేకించి షీలాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది.
Advertisement