సామాన్యుడా... స్వాగతం! | Welcome to common man! | Sakshi
Sakshi News home page

సామాన్యుడా... స్వాగతం!

Published Sat, Feb 7 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

సామాన్యుడా... స్వాగతం!

సామాన్యుడా... స్వాగతం!

 సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఢిల్లీకి చేరింది. మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది ఆ సామాన్యుడే. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’వాదులకు, జనాభాలో సగంగా ఉన్న పేద వర్గాలకు నచ్చే ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరంగా ఢిల్లీ ఎన్నికలు మారాయి. ‘కొందరి అభివృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ ఇక చెల్లదంటూ సాగుతున్న ఈ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాపజయాలతో, సాఫల్యవైఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారిత్రక ధోరణి.
 
 కొన్ని దశాబ్దాల కిందటి మాట. రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తొలి రోజులు. ఆసియా, ఆఫ్రికా దేశాలు అనేకం వలస సంకెళ్లు తెంచుకొని స్వతం త్రంగా అడుగులు వేయడం నేర్చుకుంటున్న రోజులు. రెండు ఆలోచనా స్రవంతులు, రెండు అభివృద్ధి నమూనాలు మరో ప్రపంచయుద్ధం స్థాయిలో ఘర్షించాయి. ఒకటి సంపదను సృష్టించడం మా తెలివైన బుర్రలకే సాధ్యమనే పెట్టుబడిదారీ నమూనా. రెండవది, సామాన్య శ్రామిక జనమే సంపదకు సృష్టికర్తలనే సోషలిస్టు నమూనా. సంపదలన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాల్సిందేనంది సోషలిస్టు నమూనా. ‘సంపదను కాదు, దారిద్య్రాన్ని పంచుతారు అందరికీ’ అంటూ కేపిటలిస్టు, సోషలిస్టును ఎద్దేవా చేశాడు. స్వయంకృతాపరాధాలతో నిలకడగా సరైన సమాధానం చెప్పలేక సోషలిస్టు నీళ్లు నమిలాడు.. క్రమంగా చతికిలపడ్డాడు. విజయగర్వంతో కేపిటలిస్టు ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు.
 
 కాల చ క్రం గిర్రున తిరిగింది.
 
 భూగోళం మీద అపారమైన సంపద పోగుపడింది. నాడు ఏడంతస్తుల మేడ ఓ కల. నేడు నూరంతస్తుల భవనం వాస్తవం. నాడు శ్రీమంతుడు అంటే లక్షాధికారి, మహా అయితే కోటీశ్వరుడు. ఆ వర్గం మధ్యతరగతిలోకి చేరింది. బిలియనీర్లు అవతరించారు. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల(ఆరువేల కోట్ల రూపాయలకు పైగా)విలువైన సంపదకంటే ఎక్కువ ఉన్నవారు ఈ క్లబ్‌లో చేరుతారు. అలాంటి వారు ప్రపంచంలో రెండువేల మందికి పైగా ఉన్నారని ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ (2015) ప్రకటించింది. అందులో 97 మంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో మనది మూడో స్థానమట. తొలి రెండు స్థానాలు అమెరికా, చైనాలవి. అయితే ఇది అధికారికంగా అంత సొమ్మును చూపగలిగిన ‘తెల్ల’ బిలియనీర్ల జాబితా మాత్రమే. అలా చూపలేని ‘నల్ల’ నయ్యలు మన దేశంలో అంతకు అనేక రెట్లు ఉంటారని అంచనా. 1980కి పూర్వం మొత్తం ప్రపంచదేశాల జీడీపీ(ఏదాదిలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల మొత్తం విలువ) కంటే నేటి అమెరికా ఒక్క దేశం జీడీపీయే ఎక్కువ. ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల జీడీపీ లక్ష బిలియన్ డాలర్ల (అరవై కోట్ల కోట్ల రూపాయలు)కు చేరువైందని అంచనా.
 
 ప్రపంచ సంపద అపారంగా పెరిగిందనేది కళ్ల ముందట కనిపిస్తున్న వాస్తవం. అయితే అదే మేరకు ప్రజల మధ్య సంపద పంపిణీ హేతుబద్ధంగా ఉందా? ప్రపంచ పర్యావరణ సమతుల్యత ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, అంతకంటే ఘోరంగా ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదనే నిజా లను తాజా గణాంకాలు చాటి చెబుతున్నాయి. ‘ఆక్స్‌ఫామ్’ (ఆక్స్‌ఫర్డ్ కమిటీ ఆన్ ఫేమిన్) అనే అంత ర్జాతీయ సంస్థ ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ఈ మధ్యనే ప్రకటించింది. ప్రపంచ జనాభాలోని ఒక శాతం మంది చేతిలో 99 శాతం సంపద పోగుబడనుంది. మిగిలిన 99 శాతం ప్రజలు ఒక శాతం సంపదను పంచుకోబోతున్నారు. ఒక ఏడాదిలోపునే ప్రపంచం ఈ మైలురా యిని చేరుకుంటుందట. సగటున రోజుకు రెండు డాలర్లకంటే తక్కువ సంపాదన ఉన్నవారు ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారని ‘వరల్డ్ బ్యాంక్ డెవలప్‌మెంట్ ఇండికేటర్స్’ (2008) నివేదిక వెల్లడించింది. దుర్భర దారిద్య్ర పరిస్థితుల కారణంగా ప్రతిరోజూ 22 వేల మంది పిల్లలు మృత్యు వాత పడుతున్నారని ‘యూనిసెఫ్’ నివేదిక వెల్లడిస్తోంది. డయేరియాతో (అతిసార వ్యాధి) ఏటా 18 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. 110 కోట్ల మందికి తాగునీటి వసతి లేదు. 260 కోట్లమందికి పారిశుద్ధ్య సదుపాయం లేదు. వ్యక్తిగత వస్తు వినియోగం లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అత్యంత సంపన్నులైన 20 శాతం మంది ప్రపంచం అంతటా ఉత్పత్తవుతున్న మొత్తం వినిమయ వస్తు సామగ్రిలో 76.6 శాతాన్ని వినియోగిస్తుంటే, అత్యం త పేదలైన 20 శాతం మంది కేవలం ఒకటిన్నర శాతం వినియోగిస్తున్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా ప్రజలు కాస్మెటిక్స్ మీద ఏటా చేసే ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు. కాగా, నూట పాతిక కోట్ల జనాభాగల మన దేశ తాజా బడ్జెట్‌లో తాగు నీటికీ, పారిశుద్ధ్యానికి సంయుక్తంగా కేటాయించినది 15 వేల కోట్ల రూపాయలు. 75 కోట్ల ఐరోపా ఖండ ప్రజలు కాలక్షేపంగా ఐస్‌క్రీమ్‌లు లాగించేయడానికి ఏటా 70 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, మన కేంద్ర బడ్జెట్ ప్రాథమిక విద్యారంగం కోసం కేటాయించినది రూ. 40 వేల కోట్లు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి కనీస వసతులు అందని తీవ్ర పేదరికంలో 30 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ బతుకులీడుస్తున్నారని నాలుగు రోజుల కిందటే విడుదలైన సహస్రాబ్ది అభి వృద్ధి లక్ష్యాలపై ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
 
 ఇలా పేద, ధనిక వర్గాల మధ్య అంతరం అనంతంగా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారీ వర్గ ప్రవక్తలైన ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ల అభీష్టం (ఫండ్-బ్యాంకు విధానాల) మేరకు ప్రపంచంలో సంపద సృష్టి బాగానే జరి గింది. కానీ అది కొద్ది మంది సంపన్నులదిగా కేంద్రీకృతమైంది. ‘అభివృద్ధితో ఆకలి, పేదరికాల నిర్మూలన’ అన్న పెట్టుబడిదారీ ప్రవక్తల ప్రవచనాలు ఆచర ణలో పేదల మధ్య దారిద్య్రం పంపిణీగానే మిగిలాయి. పేద, బడుగు దేశాల వృద్ధి సైతం సంపన్న దేశాలకే మేలు చేసింది. ఈ పరిణామానికి ప్రధాన బాధ్యత ‘ఫండ్-బ్యాంకు’ ప్రవక్తలదే. వర్ధమాన దేశాల్లో అవి అమలు చేసిన రుణ నిబంధనలు అవాంఛనీయ స్థాయి ప్రైవేటీకరణకు దారులు వేసి పేద వర్గాలకు, సామాన్యులకు కనీస వసతులను సైతం దూరం చేశాయి. ఆ ఆర్థిక, సామాజిక విధానాలనే నయా ఉదారవాద విధానాలనే హాస్యాస్పదమైన పేరుతో పిలుస్తున్నారు. వాటి ఫలితంగానే చివరకు ప్రపంచ జనాభాలో ఒక శాతం చేతిలో 99 శాతం సంపద అనే అమానవీయ దశకు పెట్టుబడిదారీ ‘అభివృద్ధి’ చేరింది. అవధులు దాటిన ఆ అమానవీయతే, దురాశే ప్రపం చాన్ని 2008 నుంచి కనీవినీ ఎరుగని సంక్షోభంలోకి నెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మానవాళి కథ మరో మలుపు తిరగడమూ ప్రారంభమైంది.
 
 పెట్టుబడిదారీ సంపద సృష్టి యజ్ఞంలో తీవ్ర దురన్యాయానికి, వంచ నకు గురయిన సామాన్యుడు నెమ్మదిగా శిరసెత్తి ప్రశ్నించడం మొదలు పెట్టా డు. సొమ్మసిల్లిన గత సోషలిస్టు ఉద్యమాలే స్ఫూర్తిగా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభించాడు. తోచిన ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకుంటూ ‘నయా ఉదారవాద’ దండయాత్రకు ఎదురునిలిచి పోరాడటం మొదలు పెట్టాడు. ప్రపంచ బ్యాంకు-ఐఎమ్‌ఎఫ్‌ల దౌష్ట్యానికి తొలి సమిధలైన లాటిన్ అమెరికా దేశాల నుంచే సామాన్యుని ప్రతిఘటన ప్రారంభమైంది. వెనిజు లాకు చెందిన హ్యూగో చావేజ్ నాయకత్వం ఇచ్చిన ఉత్తేజంతో చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలీవియా, నికరాగ్వా తదితర పన్నెండుకుపైగా వామ పక్ష ప్రభుత్వాలు అలా ఆవిర్భవించినవే. గ్లోబలైజేషన్ శకంలో బ్యాంక్-ఫండ్ ప్రవచనాలకు ప్రత్యామ్నాయమే లేదనే మూఢ మేధావులు ఆ ప్రభుత్వాలను మూణ్ణాళ్ల ముచ్చటేనని శాపనార్థాలు పెట్టారు. ఇదిగో నేడు, రేపు కుప్పకూలు తాయని జోస్యాలు చెప్పారు. నేడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చౌకగా తాగు నీరు, విద్యుత్తు, రవాణా తదితర ప్రజోపయోగ సర్వీసులను వాగ్దానం చేయ డాన్ని ఈసడిస్తున్నట్టే లాటిన్ అమెరికన్ వామపక్ష ఆర్థిక విధానాలను హేళన చేశారు. వెక్కిరించిన పెట్టుబడిదారీ విధానం 2008లో వెల్లకిలా పడి మరి లేవలేదు. అక్కడి నుంచి ప్రారంభమైన సామాన్యుని ప్రతిఘటనా యాత్ర ఇప్పుడు ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నట్టు కనబడుతున్నది. ‘‘రొట్టె ముక్క, ఉపాధి, స్వేచ్ఛ’’ల కోసం ఎలుగెత్తిన అల్పులే మధ్య ప్రాచ్యాన్ని ఊపే సిన అరబ్బు వసంతంగా పుష్పించారు. దగాపడి ఓడినా, పెట్టుబడి కోట అమెరికాలో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమానికి ఊపిరులయ్యారు, ‘యూరో’ కాటుకు విలవిల్లాడుతున్న ఐరోపా సామాన్యుల ఆగ్రహమే స్పెయిన్, సైప్రస్, పోర్చుగల్‌ల నుండి జర్మనీ రాజధాని బెర్లిన్ వరకు అడుగడుగునా ప్రత్యక్ష మైంది. గడచిన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా నుంచి కూడా సామాన్యుని గళం ప్రపంచమంతా ప్రతి ధ్వనించేలా వినబడుతోంది. విక్టోరియా, క్వీన్స్‌లాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలనిచ్చిన సామాన్యుడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అడవులు, భూములు, కొండలు, గనులు వగైరా ప్రజా ఆస్తులను అడ్డగోలుగా అమ్మేసుకుంటున్న ప్రభుత్వ దుర్నీతిని వీధుల్లోకి వచ్చి ప్రశ్నించిన సామాన్యుడు ఎన్నికల్లో పాలక పార్టీని మట్టి కరిపించి లేబర్ పార్టీకి పట్టం కట్డాడు. గ్రీస్‌లో ‘సిరిజా’కు బ్రహ్మరథంపట్టి పొదుపుచర్యల పేరిట పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సామాన్యులపై వేటు వేయడం ఇక సాగ దని ప్రకటించాడు.  
 
 సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఇప్పుడు ఢిల్లీ వీధులకు చేరిం ది. ఎదురు లేదనుకున్న నరేంద్ర మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఘనత ఆ సామాన్యుడిదే. ఢిల్లీ నగరం నిట్టనిలువునా చీలిపో యింది. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కట్టి, కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’ సమర్థకులకు, జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న పేద వర్గాల ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరం గా ఢిల్లీ ఎన్నికలను మార్చింది. మోదీ ‘అభివృద్ధి’ మైకం వీడి మధ్య తరగతి ఏ కొద్దిగా మొగ్గినా ఆమ్ ఆద్మీ విజయఢంకా మోగడం ఖాయం. ఫలితాల మాట ఎలా ఉన్నా, ఈ రోజున ఢిల్లీలో సామాన్యుడు మోహరించిన తీరు భారత రాజకీయాల్లో నూతన రుతు ఆగమనానికి సంకేతం. ‘కొందరి అభి వృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ అనే దురన్యాయం ఇంకానా? ఇక సాగదం టూ సాగే ఈ సామాన్యుని రాజకీయ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాప జయాలతో, సాఫల్యై వెఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారి త్రక ధోరణి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందు డిందు... ఆ సామాన్యుండెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్!

muralivardelli@yahoo.co.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement