న్యూఢిల్లీ: సామాన్యునికి ఇక ప్రభుత్వ పథకాలు మరింత సులభతరంగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న వివిధ పథకాల పంపిణీ కోసం ‘జన్ సమర్థ్’ పేరుతో ఒక ఉమ్మడి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనిష్ట ప్రభుత్వ జోక్యం– గరిష్ట పాలన ప్రయోజనాలకు సంబంధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతలో భాగంగా, కొత్త పోర్టల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ప్రారంభంలో 15 క్రెడిట్–లింక్డ్ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలలో కొన్ని బహుళ సంస్థల ప్రమేయం ఉన్నందున, అనుకూలతలు, అవకాశాలను బట్టి అందించే ప్రయోజనాలు, పథకాల సంఖ్యను విస్తరించడం జరుగుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఉదాహరణకు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్‌సీఎస్‌ఎస్) వంటి పథకాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత పోర్టల్ ఈ పథకాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురావాలని భావిస్తోంది.
తద్వారా పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు ఎక్కువ ఇబ్బంది లేకుండా పొందవచ్చు. పోర్టల్ అమలుపై పైలట్ టెస్టింగ్ జరుగుతోందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇతర రుణదాతలు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రారంభానికి ముందే ఎటువంటి సమస్యలూ లేకుండా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఈ వేదికపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా తమ పథకాలను అందించడానికి వీలుగా పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సూత్రప్రాయ ఆమోద పొందిన తర్వాత తాజా ప్రతిపాదిత పోర్టల్ ద్వారా కేవలం 7–8 పని దినాలలో రుణం పంపిణీ జరుగుతుందని భావిస్తున్నారు.
‘59 నిముషాల పోర్టల్’తో బహుళ ప్రయోజనాలు
కాగా, రుణగ్రహీతలకు సౌకర్యాన్ని అందించడానికి వీలుగా ప్రభుత్వం 2018లో సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు, గృహాలు, ఆటో వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల క్రెడిట్ సౌలభ్యత కోసం జ్టి్టp:// pటb ్చౌnటజీn59 ఝజీnu్ట్ఛట. ఛిౌఝ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా రుణగ్రహీతల కేవలం 59 నిమిషాల్లో వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తగిన రుణ ఆమోదాలను పొందే సౌలభ్యత ఏర్పడింది. అంతక్రితం 20–25 రోజుల టర్నరౌండ్ సమయంతో పోలిస్తే 59 నిముషాలకు సంబంధించిన పోర్టల్ రుణ గ్రహీతలకు ఎంతో ప్రయోజనం కల్పించింది. ఈ ప్రక్రియలో మంజూరు దశ వరకు పోర్టల్ మానవ ప్రమేయం లేకుండా రుణ దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయి.
సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏదీ సూత్రప్రాయ ఆమోదం కోసం భౌతికంగా ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు, జీఎస్‌టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు మొదలైన అనేక మూలాల నుండి డేటా పాయింట్‌లను విశ్లేషించడానికి పోర్టల్ అధునాతన అల్గారిథమ్‌లపై ఆధారపడి పనిచేస్తుంది. రుణగ్రహీతల అర్హతను తనిఖీ చేయడానికి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్‌ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌తో తాజా ప్లాట్‌ఫామ్ అనుసంధానమై ఉంటుంది. పోర్టల్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు చెందిన 1.12 లక్షల రుణ దరఖాస్తులకు ప్రభుత్వ బ్యాంకులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. మొత్తం రూ.37,412 కోట్లు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment