న్యూఢిల్లీ: తాము పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి తెలుసుకొనేందుకు పలువురు భారతీయ జనతా పార్టీ ఆశావహులు వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన 67 మందిలో అత్యధికులు తమ నియోజకవర్గాల్లో విజయావకాశాలపై సర్వే చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్వల్ప తేడాతో గెలిచిన లేదా ఓడిన అభ్యర్థులు ఇందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఈ సర్వే ద్వారా తమ పట్ల ఓటర్లలో ఏదైనా సానుకూల ప్రభావం కనిపిస్తే తమకు టికెట్ దక్కే అవకాశాలు అధికంగా కాగలవని వారు భావిస్తున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన లేదా ఓడిపోయిన కొందరు అభ్యర్థుల స్థానంలో వేరొకరిని రంగంలోకి దింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ సర్వేకు తెర తీసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే యువతకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటిస్తుండడంతో పార్టీ దృష్టిలో వయోవృద్ధులుగా ముద్రపడిన వారు కూడా ఈ సర్వే చేయించుకుంటున్నారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ బీజేపీ నేత చెప్పారు. ఈ సర్వే కోసం అభ్యర్థులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సర్వే ఫలితాలు సానుకూలంగా వస్తే, తనకు స్థానికుల మద్దతు ఉం దని పార్టీ ముందు చెప్పుకునేందుకు కూడా ఇది పనికి వస్తుందని వారు భావిస్తున్నారు.
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున 31 మంది శాసనసభ్యులుగా విజయం సాధించిన సంగతి తెల్సిందే. వీరిలో ముగ్గురు ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. కనీసం ఆరు సీట్లలో స్వల్ప ఓట్ల తేడాతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గెలవటమో, ఓడటమో జరిగింది. దీంతో గత ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా ఈ సర్వే చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బలంగా వీచిన ఆప్ గాలుల వల్లే తాము ఓటమి చెందామనిక్రితంసారి ఓడిన వారు చెప్పారు. అయితే ఈ ఏడాది కాలంలో పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని, ఈసారి తమకు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయని వారు భావిస్తున్నారు. అయితే ఓటర్లలో తమపట్ల ప్రతికూలత కనిపిస్తే మౌనం వహించాలని కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నారు.
కేంద్ర నాయకత్వం తమ ప్రాభవాన్ని గుర్తించే ఏదో ఒక సీటును కేటాయించకపోతుందా అన్న ఆశతో ఎదురు చూసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజల నాడిని తెలుసుకొనేందుకు ఈ సర్వేలు దోహదపడగలవని, ఓ అభ్యర్థి సొంతంగా సర్వే చేయించుకుంటే వచ్చే నష్టమేమీ లేదని దక్షిణ ఢిల్లీ ఎంపీ, బీజేపీ నాయకుడు రమేశ్ బిధూడీ అన్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సర్వేలకు ప్రాధాన్యతనిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. కేవలం కొద్ది వేల రూపాయల ఖర్చుకు భయపడి తమకు లభించబోయే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేని అభ్యర్థులందరూ ఒకరి తరువాత ఒకరు ఈ సర్వేలు చేయించుకుంటున్నారు.
గెలిచే అవకాశముందా?!
Published Sun, Dec 7 2014 11:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement