వారణాసి : మోదీ సొంత నియోజకవర్గంలో భారత జనతా పార్టీకి ఊహించని పరిణామం. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. స్వతంత్ర్య అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం విశేషం.
మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఏబీపీవీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలోకి దిగగా, సమాజ్‌వాదీ ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్‌కి టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశాడు. మొత్తం పోలైన ఓట్లలో 2.365 ఓట్లు రాహుల్‌కి దక్కగా, వాల్మీకికి 1,393 ఓట్లు దక్కాయి. దీంతో వెయ్యికి పైగా ఓట్లతో రాహుల్ ఘన విజయం సాధించినట్లయ్యింది. ఇక వాల్మీకిపై పలు ఆరోపణలు రావటం.. రాహుల్ అనుచరులపై దాడి చేశాడన్న కేసు వాల్మీకి ఓటమికి కారణాలైనట్లు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఉపాధ్యక్ష పదవి, లైబ్రేరీ సెక్రటరీ పదవులను గతేడాది అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఎస్‌సీఎస్(సమాజ్‌వాదీ పార్టీ విభాగం), ఎన్‌ఎస్‌యూఐ(కాంగ్రెస్ పార్టీ విభాగం) నిలుపుకోగా, ఉన్న ఒక్క పదవిని ఏబీవీపీ కోల్పోయినట్లయ్యింది. కాగా, ఈ మధ్య జరిగిన పలు యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ వరుస పరాజయాలను చవిచూడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment