సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు రూ.10కోట్ల విలువైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ఆయన ...ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ధర్మపోరాట దీక్షలంటూ చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన సినీ నటుడు కృష్ణుడుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం తన సాయశక్తుల కృషిచేస్తానని తెలిపారు. టీడీపీ దీక్షలకు టీడీపీ నాయకులు మాత్రమే వస్తారని, తమ దీక్షకు జెండా మోసే కార్యకర్తలొస్తారని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలన్నీ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారని వ్యాఖ‍్యానించారు.
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించబోతున్నామని తెలిపారు. తమ కళాకారుల బృందం ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదో ప్రశ్నిస్తుందన్నారు. ‘మందులోడా.. ఓ మాయలోడా’ అంటూ ప్రచారం సాగిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలో దివంగత నటుడు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ కూడా తమతో కలుస్తారని పృథ్వీ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సినీ నటుడు కృష్ణుడు తెలిపారు. పృథ్వీకి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన స్వాగతించారు.
నాటకాలతో టీడీపీ వైఫల్యాలను ఎండగడతాం: పృథ్వీ
Published Sat, Feb 16 2019 12:53 PM | Last Updated on Sat, Feb 16 2019 3:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment