సాక్షి, చెన్నై: పార్టీ పెట్టాలన్న ఆలోచన తనకు లేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. పార్టీ పెట్టే ప్రసక్తే లేదని, ప్రజాహితం కాంక్షిస్తూ, మంచి పనులు చేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ విశాల్ రాజకీయ పయనానికి ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంగా ఓ మీడియాకు ఆదివారం విశాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆర్కేనగర్‌లో పోటీకి సిద్ధపడానే గానీ, మరే కారణాలు లేవని స్పష్టంచేశారు.
ఆర్కేనగర్ ప్రజలకు మంచి జరిగి ఉంటే, తాను వచ్చి ఉండే వాడిని కాదని వ్యాఖ్యానించారు. తానంటే కొందరికి ఎందుకు అంత భయమో అంతు చిక్కడం లేదన్నారు. తనను గురిపెట్టి దిగజారుడు, ఇంకా చెప్పాలంటే, నీచ రాజకీయాల్ని ప్రదర్శించారని మండిపడ్డారు. సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు, బెదిరింపులు, కిడ్నాప్‌ల పర్వాల్ని ప్రత్యక్షంగా ఆర్కేనగర్‌లో తాను చూశానని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందరో స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉండగా, ఒక్క తనను మాత్రమే టార్గెట్ చేయడం బట్టి చూస్తే, తనకు ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఆ వ్యక్తులు గుర్తించినట్టున్నారని పేర్కొన్నారు.
తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక్క ప్రజలతో తప్పా అని వ్యాఖ్యానించారు. తన వెనుకు దినకరన్, స్టాలిన్, కమల్ ఉన్నట్టు ప్రచారం చేశారని, అయితే, వీళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన వెనుక వారి హస్తం లేదని స్పష్టం చేశారు. తనను నడింపించేందుకు ఎవరో అవసరం లేదని, ప్రజలు చాలు అని, ప్రజలతో కలిసి మంచి కార్యక్రమాలు, పనులు కొనసాగుతాయని తెలిపారు. రాజకీయ పార్టీల ఆలోచన లేదని, అస్సలు ఆ ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు.
ఇక, నామినేషన్ వ్యవహారంలో జరిగిన తంతంగాన్ని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. జయలలిత మరణం తదుపరి అనేక మందికి ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment