
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శరత్‌కుమార్ తనయురాలు, సినీ నటి వరలక్ష్మి బుధవారం బీజేపీలో చేరినట్టు కథనాలు వచ్చాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారని తమిళ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తలపై నటి వరలక్ష్మి వివరణ ఇచ్చారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా మురళీధర్‌రావు బుధవారం వరలక్ష్మిని కలిశారు. మోదీ ప్రభుత్వ విజయాలను ఆమెకు వివరించారు. దీంతో ఆమె బీజేపీలో చేరిందన్న కథనాలు ఊపందుకున్నాయి. దీంతో తాను బీజేపీలో చేరలేదని ఆమె వివరణ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాల గురించి తెలుసుకునేందుకే తాను బీజేపీ నేతలను కలిశానని, ఆ సమావేశంలో దేశ ప్రగతి,మహిళల భద్రత గురించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేసిన కృషిని వివరించారని, ఈ విషయాలు తనకు సంతృప్తి కలిగించాయని ఆమె అన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం దళపతి 62, మిస్టర్ చంద్రమౌళి, శక్తి, కదల్ మన్నన్ వంటి పలు సినిమాల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన గతంలో ఆలిండియా మక్కల్ సమథువ కచ్చి పార్టీని స్థాపించారు.