సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో 13 లోక్‌సభ సీట్లకు సీపీఎం పార్టీ మంగళవారం నాడు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో ఆ పార్టీ ఇప్పటి వరకు రాష్ట్రంలోని 42 సీట్లకుగాను 38 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని అర్థం అవుతుంది. సీపీఎం మార్చి 15వ తేదీన 25 లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడే చూచాయిగా ఈ విశయం అర్థం అయింది. ఆ జాబితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేర్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోపం వచ్చింది. తమ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలో నిర్ణయించడానికి సీపీఎం వారె ఎవరంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ అనుమతి తీసుకోకుండా బీర్భూమ్ అభ్యర్థిగా తమ మెడికల్ సెల్ చైర్మన్ పేరును ఎలా ఖరారు చేస్తారని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ సోమెన్ మిత్రా ఆ రోజే మీడియా ముందు ప్రశ్నించారు. ఇక సీపీఎం నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం తమకు ఎందుకుంటుందని కూడా అన్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పొత్తు చర్చలకు స్వస్తి చెప్పామని స్పష్టం చేశారు. ఇంకా తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా వదిలేశామని మంగళవారం జాబితా విడుదలప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే నాలుగు స్థానాలు ఆ పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కాబోలు. ఈ మరుసటి రోజే తాము పొత్తు కోసం సీపీఎంతో ఎలాంటి చర్చలు జరపడం లేదని కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది.
సీపీఎంతో పొత్తు పెట్టోకోవాల్సిందిగా కేంద్ర నాయకత్వం ఒత్తిడి తెస్తున్నప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇష్టం లేదని తెలుస్తోంది. 2011 ఎన్నికల వరకు 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎం పార్టీకి 2016 ఎన్నికల్లో కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. తణమూల్, బీజేపీ పార్టీలకన్నా వెనకబడింది.
ఈ పరిస్థితి ఎవరికి లాభం ?
పొత్తు కుదుర్చుకోక పోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది కాంగ్రెస్, సీపీఎం పార్టీలే. తద్వారా బీజేపీ ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. కేవలం హిందూత్వ నినాదంతోనే ఓట్లను సమీకరిస్తున్న బీజేపీ ఇప్పుడు పాలకపక్ష తణమూల్ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీలకుండా దక్కించుకునే అవకాశం ఏర్పడింది. ఎప్పుడు కూడా బెంగాల్ ఎన్నికలను స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయి. స్థానిక ఎంపీ మీద కోపం ఉన్నా, పాలకపక్ష పార్టీపై కోపం వచ్చినా అక్కడి ప్రజలు వెంటనే ప్రత్యర్థుల వైపు తిరుగుతారు. మరోపక్క తణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడే అవకాశం ఉంది. చీలకుండా ముస్లిం ఓట్లన్నీ ఆ పార్టీకే పడే అవకాశం ఉంటుంది. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో ముస్లింలు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో తణమూల్ కాంగ్రెస్ పెద్దగా రాణించలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా పొత్తుల కోసం పలు రాష్ట్రాల్లో కుస్తీ పడుతున్న ఫలితం ఉండడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment