
సిలిగూరి (బెంగాల్) : ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీని అభివృద్ధికి ప్రతిబంధకంగా, స్పీడ్ బ్రేకర్‌గా అభివర్ణించారు. దేశంలోని పేదల కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకొస్తే.. ఆ పథకాన్ని మమతా బెంగాల్‌లో అడ్డుకున్నారని, ఈ స్పీడ్ బ్రేకర్ దిగిపోయే రోజు కోసం ఎదురుచూస్తున్నామని మండిపడ్డారు. సిలిగురిలో బుధవారం జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఒకవైపు చౌకీదార్ (కాపలాదారు) ఉంటే.. మరోవైపు దాగ్‌దార్ (కళంకితులు) ఉన్నారని టీఎంసీ నేతలను దుయ్యబట్టారు.
టీ ఎస్టేస్ట్ కార్మికుల సంక్షేమం కోసం మీ చౌకీదార్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మమతకు పేదలంటే పట్టింపు లేదని, పేదరికం రాజకీయాలు చేసే ఆమె.. పేదరికం నశిస్తే.. తన రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాలాకోట్ దాడులతో మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంటే.. అందుకు ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉన్నవాళ్లు బాధపడాల్సి ఉండగా.. కోల్‌కతాలోని మమతా బెనర్జీ ఆవేదనకు గురయ్యారు. వైమానిక దాడులకు సాక్ష్యాలు కావాలంటూ అడిగారని తప్పుబట్టారు. సైన్యానికి రక్షణ ఇస్తున్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటుందని మండిపడ్డారు. శారద చిట్‌ఫండ్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ దీదీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను లూటీ చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment