కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలకబూనారు. తనని సంప్రదించకుండా తమ రాష్ట్రం గుండా ప్రవహించే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ఇకపై నీటి పంపిణీల విషయంలో బంగ్లాదేశ్‌తో కేంద్రం జరిపే ముఖ్య సమావేశాలకు తమకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.
మూడవసారి ప్రధానిగా మోదీ బాధ్యతులు స్వీకరించే సమయంలో భారత్‌కు తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. ఆ తర్వాత భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల భేటీలో తీస్తా సహా నదీ జలాల పంపిణీపై రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.
సిక్కింలో పుట్టిన తీస్తానది భారత్‌లో దాదాపూ 320 కిలోమీటర్లు ప్రవహించాకా.. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అయితే తీస్తా నదీ జలాల పంపకం భారత్-బంగ్లాల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్-బంగ్లాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవి కొలిక్కి రావడం లేదు. అందుకు పశ్చిమ బెంగాల్ కారణమని తెలుస్తోంది.
ఒక్క తీస్తానే కాదు..రెండు దేశాల మధ్య దాదాపూ 53 (తీస్తా నదిని కలుపుకుని 54) నదీ జలాల పంపంకంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కనీసం సూత్ర ప్రాయంగానైనా ఒప్పందం చేసుకోవాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే తీస్తా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందంటూ పశ్చిమ బెంగాల్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తీస్తా నది నీటి పంపకాల వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్ర సీఎం దీదీ ఆరోపిస్తున్నారు.
2011లోనే నాటి సీఎం మమతా బెనర్జీ ఇదే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు తరలించడంపై అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం ఆగిపోయింది. తాజాగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా మోదీతో జరిపిన చర్చల్లో తీస్తా నది పంపిణీ ఒప్పందం జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదే అంశంపై దీదీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు’ అని మోదీకి రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రజలంటే మాకు గౌరవం. వారి క్షేమం కోరుకుంటాం. కానీ భారత్-బంగ్లాదేశ్ ఫార్కా నీటి ఒప్పందం పశ్చిమ బెంగాల్ ప్రమేయం లేకుండా జరిగింది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మేం ఎట్టి పరిస్థితుల్లో నీటి పంపిణీ విషయంలో రాజీ పడబోమని దీదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment