
సాక్షి, అమరావతి : ప్రతి విషయంలోనూ పక్కవాళ్ల క్రెడిట్‌ను చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకువడంలో సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఆయన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ’నవరత్నాలు‘ను చంద్రబాబు నాయుడు వరుసపెట్టి కాపీ కొడుతున్నారు. కాపీ కొట్టడమే కాకుండా అదంతా తమ ఘనతే అని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. గురువారం నుంచి ఏడు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్, ఈ నెలాఖరున సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో చంద్రబాబు సర్కార్... చివరి కెబినెట్ సమావేశంలోఎన్నికల తాయిలాలను విచ్చలవిడిగా ప్రకటించేసింది.
‘రైతు భరోసా’ కాపీగా ‘అన్నదాత సుఖీభవ’
గత నాలుగు కేబినెట్ సమావేశాల్లో వైఎస్ జగన్ హామీలు ఏపీ మంత్రివర్గం అజెండాలో చర్చకు రావడమే కాకుండా కేబినెట్ సాక్షిగా ఆమోద ముద్ర వేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించిన రూ.2,000 పెన్షన్ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. తాజాగా ‘రైతు భరోసా’ పథకానికి కాపీగా ’అన్నదాత సుఖీభవ’ గా పేరు మార్చిఆ పథకానికి మంత్రవర్గం ఆమోదం కూడా వేసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు కూడా. వచ్చే ఏడాది పథకానికి ఇప్పుడే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఎన్నికల ముందు పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇచ్చేలా నిర్ణయించింది.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలతో కలిసి రూ.10వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన సమావేశంలోనే చంద్రబాబు దాదాపు తాను అనుకున్న అన్ని పనులకు ఆమోదం తెలిపారు. జర్నలిస్టులకు 30 ఎకరాల భూమి (ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు) కేటాయించింది. తొలివిడత సీఆర్‌డీఏకు రూ.కోటి చెల్లిస్తే సొసైటీకి భూమి కేటాయింపు, మిగతా మొత్తం రెండేళ్లలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇక ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల స్థలం...గజం రూ.4వేల చొప్పున 2390 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదించింది.
అధికారంలోకి వచ్చాక ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలను మాయ చేసేందుకు ఈ పథకాలను ప్రకటించడం విశేషం. వైఎస్ జగన్ ప్రకటించిన రూ.2,000 పెన్షన్ పథకాన్ని బాబు కాపీ కొట్టారు. జనవరి 1వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదించారు. అలాగే ప్రతిపక్ష నేత ప్రకటించిన ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు పథకాన్ని సైతం కాపీ కొట్టి, అదే సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా చంద్రబాబు మళ్లీ కాపీ కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment