
బెంగళూరు: పాకిస్థాన్ బాలకోట్‌లోని జైషే మహహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక మెరుపు దాడులతో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిపోయిందట. ఈ మెరుపు దాడుల దెబ్బతో కర్ణాటకలోని 28 స్థానాల్లో 22 స్థానాల్లో బీజేపీ గెలువబోతోందని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప చెప్పుకొచ్చారు.
‘రోజురోజుకు వాతావరణం.. గాలి బీజేపీకి పెద్ద ఎత్తున అనుకూలంగా మారిపోతోంది. నిన్న పాకిస్థాన్‌లోకి ప్రవేశించి.. అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో దేశంలో మోదీ అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చూడవచ్చు’ అని ఆయన బుధవారం పేర్కొన్నారు. మెరుపు దాడులు యువతలో ఉత్సాహాన్ని నింపాయని, దీని కారణంగా కర్ణాటకలో 22 స్థానాలు గెలువబోతున్నామని ఆయన చెప్పారు.
కర్ణాటకలో బీజేపీకి ప్రస్తుతం 16 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పది సీట్లు, జేడీఎస్ రెండు సీట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ఈసారి కలిసి ఎన్నికలకు వెళుతామని ప్రకటించాయి. సీట్ల పంపకాల్లో భాగంగా జేడీఎస్ 10 నుంచి 12 సీట్లు కోరుతుండగా... కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment