లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేఖ్ యాదవ్ విమర్శించారు. ప్రతి దానికి మతం రంగు పులమడం సరికాదని, చట్టం అందరికీ సమానమేనని అన్నారు. సామరస్యాన్ని కొనసాగించడానికి, అందరికీ న్యాయం జరగడం ముఖ్యమని హితవు పలికారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం మొదలైన సందర్భంగా తమ పార్టీ ఎంపీ ఆజంఖాన్, ఆయన కుటుంబ సభ్యులను జైలు నుంచి విడుదల చేయాలని యూపీ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ ఉపాసం ఉండేందుకు వారిని అనుమతించాలని కోరారు. ఆజంఖాన్ ఎంతో అనుభవం ఉన్న నాయకుడని, రాజకీయ కక్షతో ఆయనపై అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించిందని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.
ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజంఖాన్, ఆయన భార్య తజీన్ తిమా, కుమారుడు అబ్దుల్లా ఆజం ప్రస్తుతం సీతాపూర్ జైలులో ఉన్నారు. రాంపూర్ బీజేపీ నాయకుడు ఆకాశ్ సస్సేనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై గతేడాది జనవరి 3న పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లా ఆజం రెండు బర్త్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్ట్‌లు, రెండు పాన్‌కార్డులు కలిగివున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ దాదాపు 80 కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment