సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రలోభాలు, మద్యం సరఫరా, డబ్బు పంపిణీ, కేసుల నమోదు సర్వసాధారణమైంది. కేసులు దర్యాప్తు దశ దాటకపోవడమూ షరామామూలే. ఆయా రాజకీయ పార్టీలు ‘లెక్క’తప్పుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన దానికి మించి ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు ఖర్చు చేస్తున్నారు. పోటీ పడి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి డబ్బు, మద్యం పంచుతున్నారు. ప్రతిసారీ ఈ ప్రలోభాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త రకమైన ప్రలోభాలు ముందుకు వస్తున్నాయి. మారుతున్న సాంకేతికతకు తగినట్లుగా ఓటర్లకు ఎర వేసే వస్తువులు మారుతున్నాయి. అయినా నగదు ప్రభావం మాత్రం అలాగే ఉంటోంది.
అభ్యర్థులు ఇష్టారాజ్యంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ చేయడం, ప్రలోభాలకు గురి చేయడం ఎన్నికల నియమావళి ప్రకారం నేరం. అయితే, ఈ ఉల్లంఘనలపై నమోదవుతున్న కేసులు ఆ తర్వాత సహజ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. శిక్షలు పడే పరిస్థితీ ఉండటంలేదు. అరకొర శిక్షలు పడినా వీటిని సవాలు చేస్తూ పిటిషన్లు వేస్తున్నారు. దీంతో శిక్షల అమలు దాదాపు శూన్యం. చట్టంలోని లొసుగులతో ఎక్కువమంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో వివిధ ఆరోపణలపై అధికార యంత్రాంగం నమోదు చేసిన కేసుల్లో అధిక శాతం ఇప్పటికీ దర్యాప్తు దశలోనే ఉన్నాయి. మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా పాత కేసుల విషయం తేలడంలేదు.
632 కేసులు పెండింగ్...
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే వాస్తవ ఖర్చుకు, నిబంధనల మేరకు అనుమతించే మొత్తానికి పొంతన ఉండటంలేదు. వాస్తవంగా ఖర్చు చేసే మొత్తంలో ఒకటి, రెండు శాతాన్ని కూడా అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకోవడంలేదు. కోట్ల లీటర్ల మద్యం పంపిణీ అవుతున్నా ఒకటి, రెండు శాతాన్ని కూడా అధికార యంత్రాంగం పట్టుకోలేకపోతోంది. అక్కడక్కడా పట్టుకున్న కొద్దిపాటి డబ్బు, మద్యానికి సంబంధించిన కేసులు కూడా ఏళ్లకొద్దీ పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఇప్పటివరకు రూ.104 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.154 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో అధికార యంత్రాంగం రూ.76 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అనంతరం సరైన రసీదు సమర్పించినవారికి రూ.49 కోట్లను తిరిగి ఇచ్చేశారు. మిగిలిన మొత్తానికి ధ్రువీకరణలు లేకపోవడంతో ఆదాయపన్ను శాఖ పరిశీలించి జరిమానా విధించింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 2.16 లక్షల లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మద్యం సరఫరాకు సంబంధించిన ఆరోపణలపై 1,649 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఈ కేసుల విషయం తేలలేదు. 639 కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. వీటి దర్యాప్తు, విచారణ పూర్తయి శిక్ష ఖరారు కావడం ఎప్పుడు పూర్తవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.
చట్టంలో ఇలా....
- పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలి. లౌడ్‌స్పీకర్ల ద్వారా మాత్రమే కాదు, టీవీ, రేడియో, సినిమాల్లోనూ ప్రచారం చేయకూడదు. ఈ నిబంధన ఉల్లంఘించినవారికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
- ఫలానా అభ్యర్థిగానీ, పార్టీగానీ ఓటు వేయాలని ప్రలోభపెడుతూ నగదు ఇవ్వడం, ఇస్తామని ఆశపెట్టడం నేరం. ఇలాంటి ఆరోపణలు రుజువైతే... బాధ్యులకు భారతీయ శిక్షా స్మతి(ఐపీసీ)లోని సెక్షన్ 171బి/171(ఇ) ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తారు. దొంగ ఓటు వేసినట్లు నిరూపణ అయినా ఇదే శిక్ష ఉంటుంది.
- కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతుల ప్రాతిపదికన ఓట్లు వేయాలని కోరడం నేరం. ఇలాంటి ఆరోపణలు రుజువైన సందర్భాల్లో ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది.
నగదు దొరికితే..
ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకునే నగదు విషయంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. తనిఖీలో దొరికే నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అనంతరం ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇస్తారు. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను వివరాలను సమర్పించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు సూచిస్తారు. వివరాలను సమర్పిస్తే వెంటనే నగదు ఇస్తారు. ఒకవేళ అది లెక్క చూపని నగదు అయితే 30 శాతం జరిమానా విధించి మిగిలిన నగదును ఇస్తారు. నగదు ఎవరిదనే విషయంలో అస్పష్టత ఉంటే ఆ మొత్తాన్ని ఆయా రాష్ట్రాల్లోని ఖజానా శాఖకు జమ చేస్తారు. ఆయా వ్యక్తులు సరైన వివరాలు సమర్పించి, పన్ను చెల్లించిన తర్వాత తిరిగి ఇస్తారు. లేకుంటే ప్రభుత్వ ఖాజానాలో ఆ మొత్తం ఉంటుంది. అయితే, తనిఖీలో స్వాధీనం చేసుకున్న నగదు ఫలానా వ్యక్తిదని నిర్ధారణ అయిన సందర్భాల్లోనే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment