సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే అంచనా నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, సింగరేణిలో బలమైన పట్టున్న సీపీఐ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏఐటీయూసీకి కాంగ్రెస్, టీడీపీ, టీ జేఏసీ మద్దతిస్తున్నాయి. గతంలో కేవలం సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన సింగరేణి ఎన్నికలు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగగా.. విపక్షాలు కూడా దీటుగా ప్రచారం చేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాలంటూ ప్రచారానికి దిగారు.
టీఆర్‌ఎస్ ఆధిపత్యం!
తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగరేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందింది. వాటిల్లో ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, వరంగల్‌లో భూపాలపల్లి, కరీంనగర్‌లో పెద్దపల్లి, మంథని, రామగుండం, ఆదిలాబాద్‌లో ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలలో ప్రత్యక్షంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. పరిసరాల్లోని మరో ఏడెనిమిది నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన ప్రతికూల ఫలితాలను అధిగమించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.
అధికారపార్టీని ఓడించండి...
కార్మికుల సంక్షేమాన్ని, సింగరేణి భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రచారం సందర్భంగా పిలుపునిచ్చారు. వారసత్వ ఉద్యోగాలు, ఓపెన్‌కాస్ట్ మైనింగ్, కార్మికులకు నివాసం వంటి వాటితో పాటు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీఆర్‌ఎస్ మాటతప్పిందన్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలను అణచివేస్తున్న అధికార పక్షానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.
పక్కాగా కాంగ్రెస్ యత్నం..
అన్ని రాజకీయ పార్టీలు కూడా సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దాదాపు 20 నియోజకవర్గాల్లో ఉండటమే కారణం. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ పాత జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు ప్రభావాన్ని చూపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. టీఆర్‌ఎస్‌ను నిలువరిం చేందుకు అన్ని శక్తులనూ కేంద్రీకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేసి.. దాదాపు ఏడెనిమిది నెలలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.