Labor union election
-
మెడికల్ ఇన్వాలిడేషన్తోనే కారుణ్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మికుడు సర్వీస్‌లో ఉండి చనిపోయినప్పుడుగానీ, శాశ్వతంగా ఉద్యోగం చేయలేని స్థితికి చేరుకున్న ప్పుడు ‘కారుణ్య నియామకాల’కింద కుటుం బ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ పవిత్రన్‌కుమార్ శనివారం సర్క్యులర్ (నం బర్ 305) విడుదల చేశారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి 2017 మార్చి 16న కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్స్ (ఎన్సీడబ్ల్యూఏ) నిబంధనలు, గతంలో జారీ అయిన సర్క్యులర్లకు అనుగుణంగా ‘కారుణ్య నియామకాలు’ జరపనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రకారం కార్మికుడు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద కంపెనీ నిబంధనలకు లోబడి డిపెండెంట్‌కు ఉద్యోగం కల్పించనున్నారు. సర్వీస్‌లో ఉన్న సింగరేణి కార్మికుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా వారసులకు ఉద్యోగం కల్పిస్తారు. ఈ సర్క్యులర్ ద్వారా కార్మికుని కొడుకు, కూతురుతో పాటు దత్తత వారసులను, సోదరులను, అల్లుళ్లు, వితంతువుగా మారిన కూతురు లేదా కోడలు, భార్యను కోల్పోయిన అల్లుళ్లను కూడా డిపెండెంట్‌గా సంస్థ పరిగణనలోకి తీసుకొంది. మెడికల్ ఇన్వాలిడేషన్కు సంబంధించి మెడికల్ బోర్డులో కొత్తగా రోగాలు చేర్చలేదు. ఎన్నేళ్ల సర్వీస్ ఉంటే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చో స్పష్టత ఇవ్వలేదు. వారసత్వ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం 1998 నుంచి సింగరేణిలో రద్దయిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ 2016 దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో రెండేళ్ల సర్వీస్ ఉన్న ప్రతి కార్మికుడు తన వారసులకు బొగ్గు గనుల్లో అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్ అది. దీంతో సింగరేణిలో కార్మికులు, వారసులు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై గోదావరిఖనికి చెందిన ఓ నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో హైకోర్టు వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను కొట్టేసింది. దీనిపై సింగరేణి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్‌లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలకు బదులు కారుణ్య నియామకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానాన్ని సింగరేణిలో అమలు చేస్తామన్నారు. దీంతో సింగరేణి ఎన్నికల్లో అధికారిక టీబీజీకేఎస్ యూనియన్ ఘన విజయం సాధించింది. ‘మెడికల్ అన్‌ఫిట్’ కొత్తేం కాదు సింగరేణిలో కార్మికుడు చనిపోతే డిపెండెంట్ కింద భార్య, కొడుకు, కూతురులలో ఒకరికి ఉద్యోగం కల్పించే ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ‘మెడికల్ అన్‌ఫిట్’విధానం ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే విధానం కూడా పాతదే. కార్మికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పనిచేయలేని స్థితికి చేరినప్పుడు గానీ, పక్షవాతం, కుష్టు, క్యాన్సర్, టీబీ, గుండె వ్యాధులకు గురై విధుల నిర్వహణకు పనికిరాడని తెలిసినప్పుడుగానీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధానం ఉంది. కొత్తగూడెంలోని సింగరేణి మెడికల్ బోర్డు కార్మికుడు వైద్యపరంగా నిస్సహాయుడు అని నిర్ధారిస్తూ ‘మెడికల్ అన్‌ఫిట్’సర్టిఫికెట్ ఇస్తే డిపెండెంట్‌కు ఉద్యోగం వస్తుంది. కొత్త రోగాలు.. అన్‌ఫిట్ విధానాలేవీ? శనివారం సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్‌లో కారుణ్య నియామకాలకు సంబంధించి కొత్తగా విధివిధానాలేవీ రూపొందించలేదు. ‘మెడికల్ ఇన్వాలిడేషన్’ద్వారానే కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్న సంస్థ ‘ఇన్వాలిడేషన్’కు ఏయే రోగాలను చేరుస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆరు రోగాలకు మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్కు అవకాశం ఉంది. ‘మెడికల్ ఇన్వాలిడేషన్’కు అర్థాన్ని వివరిస్తూ.. ‘వైద్యపరంగా పూర్తిగా సామర్థ్యరహితమై ఉద్యోగం కోల్పోయి కుటుంబానికి భారంగా మారడం’అని సంస్థ పేర్కొనడం గమనార్హం. 2017 దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే! గత నెల 27న శ్రీరాంపూర్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గతంలో వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసు కున్న వారంతా ఇప్పుడు మళ్లీ కారుణ్య నియామకాలకు దర ఖాస్తు చేసుకొని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. గతంలో సంస్థ జారీ చేసిన సర్క్యులర్ల రిఫరెన్స్ ప్రకారం కార్మికునికి కనీసం రెండేళ్ల సర్వీసు మిగిలి ఉండాలి. డిపెండెంట్ వయస్సు 35 దాటకూడదు. కానీ 2017లో దరఖాస్తు చేసుకున్న వారంతా ఏడాది, రెండేళ్లలోపు సర్వీసు మిగిలి ఉన్నవారే. వీరిలో చాలా మంది ఇప్పటికే రిటైర్డ్ అయ్యారు. ఏడాది గడువున్న వారికి కూడా ఇప్పుడు అవకాశం రాదు. -
నేడు సింగరేణి ఎన్నికలు
-
నేడు సింగరేణి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్, విపక్ష పార్టీలు సీపీఐ, కాంగ్రెస్‌ల అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల కూటమి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల కూటమికి మద్దతిస్తోంది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఈ ఎన్నికల్లో 52,534 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర కార్మిక శాఖ గుర్తించిన కంపెనీలోని 11 ఏరియాల పరిధిలో 92 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు/ఉద్యోగి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు (శాశ్వత/తాత్కాలిక)ను వెంటతీసుకొని రావాలని యాజమాన్యం కోరింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు పోలీస్, కౌంటింగ్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందిని నియమించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ ప్రక్రియను కేంద్ర కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన ఆర్డీవో స్థాయి అధికారులు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు విధుల్లో పాల్గొంటున్నారని సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఆరోసారి ఎన్నికలు.. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్ 9న తొలిసారిగా, 2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్ 28న ఐదోసారి ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలు సైతం శాంతియుతంగా నిర్వహించేందుకు కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, కేంద్ర కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, మీడియా సహకరించాలని సింగరేణి యాజ మాన్యం విజ్ఞప్తి చేసింది. మూడు సార్లు ఏఐటీయూసీ విజయం ఇప్పటివరకు జరిగిన సింగరేణి ఎన్నికల్లో మూడు సార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఒక్కోసారి గెలుపొందాయి. -
సింగరేణిపైనే నజర్!
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయనే అంచనా నేపథ్యంలో అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, సింగరేణిలో బలమైన పట్టున్న సీపీఐ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏఐటీయూసీకి కాంగ్రెస్, టీడీపీ, టీ జేఏసీ మద్దతిస్తున్నాయి. గతంలో కేవలం సింగరేణి కార్మికులకు, కార్మిక సంఘాలకు మాత్రమే ఆసక్తికరమైన సింగరేణి ఎన్నికలు.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగగా.. విపక్షాలు కూడా దీటుగా ప్రచారం చేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు టీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించాలంటూ ప్రచారానికి దిగారు. టీఆర్ఎస్ ఆధిపత్యం! తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా సింగరేణి ప్రభావం ఉన్న అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందింది. వాటిల్లో ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, వరంగల్‌లో భూపాలపల్లి, కరీంనగర్లో పెద్దపల్లి, మంథని, రామగుండం, ఆదిలాబాద్‌లో ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలలో ప్రత్యక్షంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. పరిసరాల్లోని మరో ఏడెనిమిది నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన ప్రతికూల ఫలితాలను అధిగమించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. అధికారపార్టీని ఓడించండి... కార్మికుల సంక్షేమాన్ని, సింగరేణి భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రచారం సందర్భంగా పిలుపునిచ్చారు. వారసత్వ ఉద్యోగాలు, ఓపెన్‌కాస్ట్ మైనింగ్, కార్మికులకు నివాసం వంటి వాటితో పాటు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీఆర్ఎస్ మాటతప్పిందన్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలను అణచివేస్తున్న అధికార పక్షానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. పక్కాగా కాంగ్రెస్ యత్నం.. అన్ని రాజకీయ పార్టీలు కూడా సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దాదాపు 20 నియోజకవర్గాల్లో ఉండటమే కారణం. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ పాత జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు ప్రభావాన్ని చూపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. టీఆర్ఎస్ను నిలువరిం చేందుకు అన్ని శక్తులనూ కేంద్రీకరిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేసి.. దాదాపు ఏడెనిమిది నెలలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
సింగరేణి ఎన్నికలకు సీఎం ప్రచారమా
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఇప్పటికే నైతిక విజయం సాధించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఇచ్చిన హామీలపై నారాయణ స్పందించారు. తొలిసారి ఒక సీఎం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పాల్గొంటున్నారని, కార్మికులకు దసరా కానుకలు ప్రకటించి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఎన్నికల కోడ్ కిందకు వచ్చినా రాకపోయినా, సీఎం కేసీఆర్ రాజకీయ అనైతిక ఖాతాకింద జమవ్వడం మాత్రం ఖాయమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారని తేలిపోయిందని, సీఎం ఉపన్యాసమే ఏఐటీయూసీని గెలిపిస్తుందని నారాయణ పేర్కొన్నారు. -
కేసీఆర్ ‘కారుణ్యం’పై హర్షాతిరేకాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని సంఘం టీబీజీకేఎస్‌ను గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్వయంగా భుజానికెత్తుకున్నారు. న్యాయ పరమైన అడ్డంకి నేపథ్యంలో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల స్థానే ‘కారుణ్య’ నియా మకాలు చేపడతామని స్పష్టమైన ప్రకటన చేసి కార్మికుల్లో కొత్త ఉత్సాహం నింపారు. వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ కుదరదంటూ ఏకంగా సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడంతో ‘డిపెండెంట్’పై ఆశలు వదులుకున్న కార్మి కుల్లో సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తమ వుతోంది. పైగా కారుణ్య నియామకాలకు అర్హత లేకపోయినా, వాటిని వద్దనుకున్నా రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న ప్రకటనతో వారి ఆనందం రెట్టింపైంది. ఏకమొత్తంలో 25 లక్షల ప్యాకేజీ ఇస్తే జీవిత మలి సంధ్యలో పిల్లలపై ఆధారపడి బతకాల్సి రావచ్చేమోనని భావించే పక్షంలో ఆ మొత్తాన్ని రిటైరయ్యాక నెలకు రూ.25 వేల చొప్పున జీవితాంతం ఇస్తామన్న సీఎం హామీపై కార్మికులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. అక్టోబర్ 5న ఎన్నికలున్న నేపథ్యంలో సీఎం ప్రకటనలు స్థానికంగా పరిస్థితిని పూర్తిగా మార్చేసినట్లయింది. సీఎం ప్రకటనపై ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి గనుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ‘వారసత్వం’పై స్పష్టతకే.. సింగరేణి ఎన్నికల ప్రకటన విడుదలైన మొదట్లో క్షేత్రస్థాయి పరిస్థితి టీబీజీకేఎస్‌కు అనుకూలంగా లేదు. వారసత్వ నోటిఫి కేషన్‌ను సుప్రీం కొట్టేయడం, సింగరేణి గుర్తిం పు సంఘం నేతల తీరు కార్మికుల్లో వ్యతిరే కతకు కారణమయ్యాయి. దీన్ని పసిగట్టిన టీఆర్ఎస్ అధినేత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరు గుతున్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అను బంధ సంస్థ ఓడితే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఆయన పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించారు. టీబీజీకేఎస్‌కు వ్యతిరేకంగా ఒకటైన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీల అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీ యూసీల కూటమి ప్రభావాన్ని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రచారంతో చాలావరకు తగ్గించగలిగారు. వారసత్వ ఉద్యోగాలు అధికార టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమన్న అభిప్రాయాన్ని కార్మికుల్లో పాదుగొల్పగలిగారు. అయినా వారిలో ఏ మూలో ‘వెలితి’, ‘అనుమాన’ ఛాయలున్నట్టు కనిపించింది. దీంతో వారసత్వంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని భావించిన కేసీఆర్, ఆ మేరకు స్పష్టమైన ప్రకటన చేసి సందిగ్ధానికి తెర దించారు. కార్మికుడు తాను ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేనని, కుటుంబ పోషణార్థం కుమారుడు లేదా అల్లుడికి అవకాశమివ్వాలని దరఖాస్తు చేసుకుంటే ‘కారుణ్య’ కోటాలో ఉద్యోగమి వ్వడమే ఈ ప్రకటన ఉద్దేశం. సదరు కార్మికుడు ‘కారుణ్య’ నియామకానికి అర్హుడు కాదని తేలితే రూ.25 లక్షల ప్యాకేజీతో పదవీ విరమణ చేయవచ్చు. అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు ఈ మొత్తం అదనం. ఇలా ఒకేసారి రూ.25 లక్షలు తీసుకోవడం వల్ల కుటుంబంలో సమస్యలొస్తాయని భావిస్తే ఆ మొత్తాన్ని నెలకు రూ.25 వేల చొప్పున జీవితకాలం జీతంగా తీసుకునే అవకాశం కూడా సీఎం ప్రకటన కల్పించింది. టీబీజీకేఎస్ పట్ల కార్మికుల్లో ఇప్పటిదాకా ఏమైనా వ్యతిరేకత ఉన్నా ఈ ప్రకటనతో పూర్తిగా పోయినట్టేనని కార్మిక వర్గాలంటున్నాయి. ‘కారుణ్యం’ సాధ్యమే! ప్రభుత్వోద్యోగాల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణిస్తే నిబంధనల మేరకు వారసునికి ‘కారుణ్య’ నియామకం కల్పిస్తారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఇది వర్తించదు. కానీ సీఎం ప్రకటన అందుకు భిన్నం. అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసే కార్మికుడు తన వారసుడిని ‘కారుణ్య’ నియామకానికి ప్రతిపాదించే ఈ ప్రక్రియ సింగరేణిలో గతంలోనూ కొనసాగింది. కాకపోతే కారుణ్యం పేరిట కాకుండా మెడికల్ అన్‌ఫిట్ కింద వారసులకు అవకాశమిచ్చే వారు. ‘కార్మికుడు ఉద్యోగం చేసే స్థితిలో లేడు’ అని సింగరేణి మెడికల్ బోర్డు సర్టిఫై చేస్తే వారసునికి ఉద్యోగమిచ్చేవారు. ఇది ఆలస్యమవుతుండటం, నియామకాల్లో కార్మిక సంఘాల నేతల జోక్యం తదితరాల నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలను తమకు అధికారికంగా ఇవ్వాలని కార్మికులు కోరుతూ వచ్చారు. ఆ మేరకు ‘కారుణ్య’ నియామకాలు చేపడతామని ఇప్పుడు ముఖ్యమంత్రే ప్రకటించడంతో సింగరేణి నియమ నిబంధనల్లో మార్పులు చేస్తే అందుకు అడ్డంకి కూడా ఉండబోదు. -
సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా
ఎన్నికల్లో స్పష్టత ఇచ్చే సంఘానికే విజయావకాశాలు ►‘ఏదో రకంగా’ వారసత్వం ఇస్తామంటున్న టీఆర్ఎస్ ►నాలుగేళ్లలో కార్మిక ప్రయోజనాలను చూపిస్తూ ప్రచారం ►టీఆర్ఎస్ వ్యతిరేకతపైనే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి ఆశలు ►ఎన్నికల్లో ప్రభావం చూపనున్న దసరా, దీపావళి బొనాంజా ప్రకటన సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణిలో అక్టోబర్ 5న జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో ‘వారసత్వ’ఉద్యోగాల అంశం కీలకంగా మారనుంది. 1998లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో నిలిచిపోయి, 2002 నుంచి శాశ్వతంగా రద్దయిన ‘వారసత్వ’ఉద్యోగాల అంశం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని సంఘాల ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారింది. సుప్రీం కోర్టు తిరస్కరించిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సంబంధించి ఏ హామీ ఇచ్చి కార్మికుల ఓట్లను పొందాలనే విషయంలో ప్రధాన సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తాజా మాజీ గుర్తింపు సంఘమైన టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి మధ్యనే ఉంది. ‘వారసత్వం’ ఎన్నికల ఎజెండాగా మారిన నేపథ్యంలో అధికారంలో ఉన్న తామే ‘ఏదో రకంగా’ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెబుతూ గులాబీ దళం సింగరేణి చేజారకుండా శాయశక్తులు ఒడ్డుతోంది. ‘వచ్చి... పోయిన’ వారసత్వం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) 2012 సింగరేణి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఇచ్చిన హామీ మేరకు 2016 దసరా కానుకగా సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది దసరా నాటికి ఉద్యోగ విరమణకు ఏడాది గడువున్న ప్రతి ఒక్కరూ తమ వారసులకు ఉద్యోగం కల్పిం చేలా సింగరేణి సంస్థ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే గోదావరిఖనికి చెంది న ఓ వ్యక్తి వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. ‘భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాల్సిందే తప్ప వారసులకు ఉద్యోగాలు కల్పించడాన్ని ఒప్పుకోం’అంటూ మార్చి 16న హైకోర్టు తీ ర్పు చెప్పగా ఆ తీర్పును ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిలిచిపోయింది. ‘వారసత్వం’ పేరుకు ప్రత్యామ్నాయంగా ... ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో 10 డివిజన్లు, ఓ కార్పొరేట్ డివిజన్ నుంచి 53,146 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలోని 10కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన ‘వారసత్వ ఉద్యోగాలు’అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గతంలోనూ నేరుగా వారసత్వం కింద కాకుండా ‘మెడికల్ అన్‌ఫిట్’ పేరుతో రిటైర్మెంట్కు రెండేళ్లలోపు గడువున్న కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు అదే విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ సర్కారు... టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే ‘ఏదో రకంగా’వారసత్వాన్ని పునరుద్ధరిస్తామని ప్రచారం చేస్తోంది. సొంతింటికి రూ. 10 లక్షల వడ్డీ లేని రుణ హామీతో టీబీజీకేఎస్ వారసత్వాన్ని ‘ఏదో రకంగా’పునరుద్ధరిస్తామన్న హామీతోపాటు సింగరేణి కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని టీబీజీకేఎస్ ఇస్తున్న హామీ చర్చనీయాంశమైంది. ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్లలో తీర్మానం చేసిన ‘సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు’ను ఈసారి గెలిచిన వెంటనే అమల్లోకి తెస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లోని 3,250 డిపెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం, లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచడం, గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారాన్ని రూ.20 లక్షలకు పెంచడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు అనుకూలించే అంశాలు. కాగా ఈ ఏడాది దసరా, దీపావళి బొనాంజాగా రూ. 82 వేలు ప్రకటించడం కూడా ‘వారసత్వ’అంశం నుంచి గట్టెక్కిస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ వ్యతిరేకతపైనే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమి ఆశలు పెట్టుకుంది. టీబీజీకేఎస్‌కు కలిసొచ్చే జాతీయ సంఘాల ఒంటరి పోరు జాతీయ స్థాయి కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కూటమిగా, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గతంలో వారసత్వ ఉద్యోగాల కోసం సాగిన సమ్మె వీరందరి ఆధ్వర్యంలో జరగ్గా ఇప్పుడు సీపీఐ, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు తప్ప మిగతావి విడివిడిగా పోటీ చేయడం టీఆర్ఎస్ సంఘానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. జాతీయ సంఘాలన్నీ కలసి పోటీ చేస్తే టీబీజీకేఎస్ వ్యతిరేక ఓట్లన్నీ ఒకే దగ్గర పడేవి. ఇప్పుడా అవకాశం లేకుండా పోనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు
ఇకపై ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు విద్యుత్ సంస్థల యాజమాన్యాల నిర్ణయం.. కసరత్తు ప్రారంభం ప్రస్తుతం టీఆర్ఎస్కేవీ, 1104, 327 సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కం సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో టీఆర్ఎస్కేవీ, 1104, 327 అనే మూడు ప్రధాన కార్మిక సంఘాలు గుర్తింపు సంఘాలుగా కొనసాగుతుండగా, ఇకపై ఆర్టీసీ తరహాలో ఒకే సంఘానికి గుర్తింపు కేటాయించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. విద్యుత్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు యాజమాన్యాలు మూడు గుర్తింపు సంఘాలతో చర్చలు జరపాల్సి వస్తోంది. అయితే సంఘాలమధ్య సమన్వయం లేక పలు సందర్భాల్లో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిసెంబర్లో కార్మిక సంఘాలన్నీ ఏకమై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టఫ్)గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వడం యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం కొన్ని సంఘాలు సమ్మె పిలుపును విరమించుకోగా, కొన్ని సంఘాలు నిరాకరించడంతో టఫ్లో చీలిక వచ్చింది. దీంతో ఒక్కో కార్మిక సంఘాన్ని బుజ్జగించి సమ్మె పిలుపును విరమింపజేయడానికి యాజమాన్యాలు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చల కోసం ఒకే సంఘానికి గుర్తింపు కల్పించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్)లలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ ను ఇటీవల ట్రాన్స్‌కో యాజమాన్యం కోరిం ది. తాజా నిర్ణయం ప్రకారం ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి, ఒకే కార్మిక సంఘానికి గుర్తింపునిస్తారు. కసరత్తు ప్రారంభించిన కార్మిక శాఖ... ట్రాన్స్‌కో విజ్ఞప్తి మేరకు విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. కార్మికుల వివరాలు (మస్టర్ రోల్స్)ను అందించాలని తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలను కోరింది. అదే విధంగా విద్యుత్ కార్మిక సంఘాల్లో సభ్యుల వివరాలను అందించాలని ఆయా కార్మిక సంఘాలకు తాజాగా లేఖలు రాసింది. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల వారీగా కేంద్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు అకౌంట్స్, ఇతర విభాగాల్లోని ఎల్డీసీ, యూడీసీ, జేఏఓ, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులు కానున్నారు. ట్రాన్స్‌కో అధికారవర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 20 వేల మందికి పైగా కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటేయనున్నారు. దీంతో ఆర్టీసీ, సింగరేణి సంస్థల తరహాలోనే ఇకపై విద్యుత్ సంస్థల్లో కూడా ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. సర్కిల్/డివిజన్ స్థాయిలో ఎలా..? విద్యుత్ సంస్థల్లో కేంద్ర/రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ, సర్కిల్, డివిజన్ స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాలేదు. జెన్కోలో విద్యుత్ కేంద్రాల పరిధిలో, ట్రాన్స్‌కో, జెన్కోలలో సర్కిల్, డివిజన్ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ట్రాన్స్కోవర్గాలు పేర్కొన్నాయి.