
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తమ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ ఇప్పటికే నైతిక విజయం సాధించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఇచ్చిన హామీలపై నారాయణ స్పందించారు. తొలిసారి ఒక సీఎం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పాల్గొంటున్నారని, కార్మికులకు దసరా కానుకలు ప్రకటించి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది ఎన్నికల కోడ్ కిందకు వచ్చినా రాకపోయినా, సీఎం కేసీఆర్ రాజకీయ అనైతిక ఖాతాకింద జమవ్వడం మాత్రం ఖాయమని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారని తేలిపోయిందని, సీఎం ఉపన్యాసమే ఏఐటీయూసీని గెలిపిస్తుందని నారాయణ పేర్కొన్నారు.