సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా | 'Inheritance' agenda in Singareni's battle | Sakshi
Sakshi News home page

సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా

Published Fri, Sep 22 2017 1:04 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా - Sakshi

సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా

ఎన్నికల్లో స్పష్టత ఇచ్చే సంఘానికే విజయావకాశాలు
‘ఏదో రకంగా’ వారసత్వం ఇస్తామంటున్న టీఆర్‌ఎస్‌
నాలుగేళ్లలో కార్మిక ప్రయోజనాలను చూపిస్తూ ప్రచారం
టీఆర్‌ఎస్‌ వ్యతిరేకతపైనే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూటమి ఆశలు
ఎన్నికల్లో ప్రభావం చూపనున్న దసరా, దీపావళి బొనాంజా ప్రకటన  


సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణిలో అక్టోబర్‌ 5న జరగనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో ‘వారసత్వ’ఉద్యోగాల అంశం కీలకంగా మారనుంది. 1998లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో నిలిచిపోయి, 2002 నుంచి శాశ్వతంగా రద్దయిన ‘వారసత్వ’ఉద్యోగాల అంశం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని సంఘాల ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారింది. సుప్రీం కోర్టు తిరస్కరించిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సంబంధించి ఏ హామీ ఇచ్చి కార్మికుల ఓట్లను పొందాలనే విషయంలో ప్రధాన సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తాజా మాజీ గుర్తింపు సంఘమైన టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌)కు, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూటమి మధ్యనే ఉంది. ‘వారసత్వం’ ఎన్నికల ఎజెండాగా మారిన నేపథ్యంలో అధికారంలో ఉన్న తామే ‘ఏదో రకంగా’ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని చెబుతూ గులాబీ దళం సింగరేణి చేజారకుండా శాయశక్తులు ఒడ్డుతోంది.

‘వచ్చి... పోయిన’ వారసత్వం
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్‌) 2012 సింగరేణి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఇచ్చిన హామీ మేరకు 2016 దసరా కానుకగా సీఎం కేసీఆర్‌ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది దసరా నాటికి ఉద్యోగ విరమణకు ఏడాది గడువున్న ప్రతి ఒక్కరూ తమ వారసులకు ఉద్యోగం కల్పిం చేలా సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అయితే గోదావరిఖనికి చెంది న ఓ వ్యక్తి వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. ‘భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాల్సిందే తప్ప వారసులకు ఉద్యోగాలు కల్పించడాన్ని ఒప్పుకోం’అంటూ మార్చి 16న హైకోర్టు తీ ర్పు చెప్పగా ఆ తీర్పును ఏప్రిల్‌ 17న సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ నిలిచిపోయింది.

‘వారసత్వం’ పేరుకు ప్రత్యామ్నాయంగా ...
ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో 10 డివిజన్‌లు, ఓ కార్పొరేట్‌ డివిజన్‌ నుంచి 53,146 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలలోని 10కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా ప్రభావం చూపే ఈ ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన ‘వారసత్వ ఉద్యోగాలు’అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. గతంలోనూ నేరుగా వారసత్వం కింద కాకుండా ‘మెడికల్‌ అన్‌ఫిట్‌’ పేరుతో రిటైర్మెంట్‌కు రెండేళ్లలోపు గడువున్న కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేవారు. ఇప్పుడు అదే విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ఉన్న టీఆర్‌ఎస్‌ సర్కారు... టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే ‘ఏదో రకంగా’వారసత్వాన్ని పునరుద్ధరిస్తామని ప్రచారం చేస్తోంది.

సొంతింటికి రూ. 10 లక్షల వడ్డీ లేని రుణ హామీతో టీబీజీకేఎస్‌
వారసత్వాన్ని ‘ఏదో రకంగా’పునరుద్ధరిస్తామన్న హామీతోపాటు సింగరేణి కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని టీబీజీకేఎస్‌ ఇస్తున్న హామీ చర్చనీయాంశమైంది. ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్‌లలో తీర్మానం చేసిన ‘సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు’ను ఈసారి గెలిచిన వెంటనే అమల్లోకి తెస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లోని 3,250 డిపెండెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయడం, లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచడం, గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారాన్ని రూ.20 లక్షలకు పెంచడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు అనుకూలించే అంశాలు. కాగా ఈ ఏడాది దసరా, దీపావళి బొనాంజాగా రూ. 82 వేలు ప్రకటించడం కూడా ‘వారసత్వ’అంశం నుంచి గట్టెక్కిస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ వ్యతిరేకతపైనే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూటమి ఆశలు పెట్టుకుంది.

టీబీజీకేఎస్‌కు కలిసొచ్చే జాతీయ సంఘాల ఒంటరి పోరు
జాతీయ స్థాయి కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కూటమిగా, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. గతంలో వారసత్వ ఉద్యోగాల కోసం సాగిన సమ్మె వీరందరి ఆధ్వర్యంలో జరగ్గా ఇప్పుడు సీపీఐ, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలు తప్ప మిగతావి విడివిడిగా పోటీ చేయడం టీఆర్‌ఎస్‌ సంఘానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. జాతీయ సంఘాలన్నీ కలసి పోటీ చేస్తే టీబీజీకేఎస్‌ వ్యతిరేక ఓట్లన్నీ ఒకే దగ్గర పడేవి. ఇప్పుడా అవకాశం లేకుండా పోనుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement