సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ బొగ్గు గని సంఘం టీబీజీకేఎస్‌ను గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్వయంగా భుజానికెత్తుకున్నారు. న్యాయ పరమైన అడ్డంకి నేపథ్యంలో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల స్థానే ‘కారుణ్య’ నియా మకాలు చేపడతామని స్పష్టమైన ప్రకటన చేసి కార్మికుల్లో కొత్త ఉత్సాహం నింపారు. వారసత్వ ఉద్యోగాల ప్రక్రియ కుదరదంటూ ఏకంగా సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడంతో ‘డిపెండెంట్’పై ఆశలు వదులుకున్న కార్మి కుల్లో సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తమ వుతోంది.
పైగా కారుణ్య నియామకాలకు అర్హత లేకపోయినా, వాటిని వద్దనుకున్నా రూ.25 లక్షల ప్యాకేజీ ఇస్తామన్న ప్రకటనతో వారి ఆనందం రెట్టింపైంది. ఏకమొత్తంలో 25 లక్షల ప్యాకేజీ ఇస్తే జీవిత మలి సంధ్యలో పిల్లలపై ఆధారపడి బతకాల్సి రావచ్చేమోనని భావించే పక్షంలో ఆ మొత్తాన్ని రిటైరయ్యాక నెలకు రూ.25 వేల చొప్పున జీవితాంతం ఇస్తామన్న సీఎం హామీపై కార్మికులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. అక్టోబర్ 5న ఎన్నికలున్న నేపథ్యంలో సీఎం ప్రకటనలు స్థానికంగా పరిస్థితిని పూర్తిగా మార్చేసినట్లయింది. సీఎం ప్రకటనపై ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి గనుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు.
‘వారసత్వం’పై స్పష్టతకే..
సింగరేణి ఎన్నికల ప్రకటన విడుదలైన మొదట్లో క్షేత్రస్థాయి పరిస్థితి టీబీజీకేఎస్‌కు అనుకూలంగా లేదు. వారసత్వ నోటిఫి కేషన్‌ను సుప్రీం కొట్టేయడం, సింగరేణి గుర్తిం పు సంఘం నేతల తీరు కార్మికుల్లో వ్యతిరే కతకు కారణమయ్యాయి. దీన్ని పసిగట్టిన టీఆర్‌ఎస్ అధినేత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. 4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరు గుతున్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అను బంధ సంస్థ ఓడితే వ్యతిరేక సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఆయన పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించారు. టీబీజీకేఎస్‌కు వ్యతిరేకంగా ఒకటైన కాంగ్రెస్, సీపీఐ, టీడీపీల అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీ యూసీల కూటమి ప్రభావాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రచారంతో చాలావరకు తగ్గించగలిగారు. వారసత్వ ఉద్యోగాలు అధికార టీఆర్‌ఎస్ ద్వారానే సాధ్యమన్న అభిప్రాయాన్ని కార్మికుల్లో పాదుగొల్పగలిగారు.
అయినా వారిలో ఏ మూలో ‘వెలితి’, ‘అనుమాన’ ఛాయలున్నట్టు కనిపించింది. దీంతో వారసత్వంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని భావించిన కేసీఆర్, ఆ మేరకు స్పష్టమైన ప్రకటన చేసి సందిగ్ధానికి తెర దించారు. కార్మికుడు తాను ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేనని, కుటుంబ పోషణార్థం కుమారుడు లేదా అల్లుడికి అవకాశమివ్వాలని దరఖాస్తు చేసుకుంటే ‘కారుణ్య’ కోటాలో ఉద్యోగమి వ్వడమే ఈ ప్రకటన ఉద్దేశం. సదరు కార్మికుడు ‘కారుణ్య’ నియామకానికి అర్హుడు కాదని తేలితే రూ.25 లక్షల ప్యాకేజీతో పదవీ విరమణ చేయవచ్చు. అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు ఈ మొత్తం అదనం. ఇలా ఒకేసారి రూ.25 లక్షలు తీసుకోవడం వల్ల కుటుంబంలో సమస్యలొస్తాయని భావిస్తే ఆ మొత్తాన్ని నెలకు రూ.25 వేల చొప్పున జీవితకాలం జీతంగా తీసుకునే అవకాశం కూడా సీఎం ప్రకటన కల్పించింది. టీబీజీకేఎస్ పట్ల కార్మికుల్లో ఇప్పటిదాకా ఏమైనా వ్యతిరేకత ఉన్నా ఈ ప్రకటనతో పూర్తిగా పోయినట్టేనని కార్మిక వర్గాలంటున్నాయి.
‘కారుణ్యం’ సాధ్యమే!
ప్రభుత్వోద్యోగాల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణిస్తే నిబంధనల మేరకు వారసునికి ‘కారుణ్య’ నియామకం కల్పిస్తారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఇది వర్తించదు. కానీ సీఎం ప్రకటన అందుకు భిన్నం. అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసే కార్మికుడు తన వారసుడిని ‘కారుణ్య’ నియామకానికి ప్రతిపాదించే ఈ ప్రక్రియ సింగరేణిలో గతంలోనూ కొనసాగింది. కాకపోతే కారుణ్యం పేరిట కాకుండా మెడికల్ అన్‌ఫిట్ కింద వారసులకు అవకాశమిచ్చే వారు. ‘కార్మికుడు ఉద్యోగం చేసే స్థితిలో లేడు’ అని సింగరేణి మెడికల్ బోర్డు సర్టిఫై చేస్తే వారసునికి ఉద్యోగమిచ్చేవారు. ఇది ఆలస్యమవుతుండటం, నియామకాల్లో కార్మిక సంఘాల నేతల జోక్యం తదితరాల నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాలను తమకు అధికారికంగా ఇవ్వాలని కార్మికులు కోరుతూ వచ్చారు. ఆ మేరకు ‘కారుణ్య’ నియామకాలు చేపడతామని ఇప్పుడు ముఖ్యమంత్రే ప్రకటించడంతో సింగరేణి నియమ నిబంధనల్లో మార్పులు చేస్తే అందుకు అడ్డంకి కూడా ఉండబోదు.