సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్, విపక్ష పార్టీలు సీపీఐ, కాంగ్రెస్‌ల అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమి ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూసీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమికి మద్దతిస్తోంది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ఈ ఎన్నికల్లో 52,534 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర కార్మిక శాఖ గుర్తించిన కంపెనీలోని 11 ఏరియాల పరిధిలో 92 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు/ఉద్యోగి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు (శాశ్వత/తాత్కాలిక)ను వెంటతీసుకొని రావాలని యాజమాన్యం కోరింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆరు జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు పోలీస్, కౌంటింగ్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందిని నియమించారు. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ ప్రక్రియను కేంద్ర కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన ఆర్డీవో స్థాయి అధికారులు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు విధుల్లో పాల్గొంటున్నారని సింగరేణి యాజమాన్యం తెలిపింది.
ఆరోసారి ఎన్నికలు..
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. 1998 సెప్టెంబర్ 9న తొలిసారిగా, 2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్ 28న ఐదోసారి ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలు సైతం శాంతియుతంగా నిర్వహించేందుకు కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, కేంద్ర కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు, మీడియా సహకరించాలని సింగరేణి యాజ మాన్యం విజ్ఞప్తి చేసింది.
మూడు సార్లు ఏఐటీయూసీ విజయం
ఇప్పటివరకు జరిగిన సింగరేణి ఎన్నికల్లో మూడు సార్లు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఒక్కోసారి గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment