సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మికుడు సర్వీస్‌లో ఉండి చనిపోయినప్పుడుగానీ, శాశ్వతంగా ఉద్యోగం చేయలేని స్థితికి చేరుకున్న ప్పుడు ‘కారుణ్య నియామకాల’కింద కుటుం బ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ పవిత్రన్‌కుమార్ శనివారం సర్క్యులర్ (నం బర్ 305) విడుదల చేశారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి 2017 మార్చి 16న కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్స్ (ఎన్‌సీడబ్ల్యూఏ) నిబంధనలు, గతంలో జారీ అయిన సర్క్యులర్లకు అనుగుణంగా ‘కారుణ్య నియామకాలు’ జరపనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రకారం కార్మికుడు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు మెడికల్ ఇన్‌వాలిడేషన్ కింద కంపెనీ నిబంధనలకు లోబడి డిపెండెంట్‌కు ఉద్యోగం కల్పించనున్నారు. సర్వీస్‌లో ఉన్న సింగరేణి కార్మికుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా వారసులకు ఉద్యోగం కల్పిస్తారు. ఈ సర్క్యులర్ ద్వారా కార్మికుని కొడుకు, కూతురుతో పాటు దత్తత వారసులను, సోదరులను, అల్లుళ్లు, వితంతువుగా మారిన కూతురు లేదా కోడలు, భార్యను కోల్పోయిన అల్లుళ్లను కూడా డిపెండెంట్‌గా సంస్థ పరిగణనలోకి తీసుకొంది. మెడికల్ ఇన్‌వాలిడేషన్‌కు సంబంధించి మెడికల్ బోర్డులో కొత్తగా రోగాలు చేర్చలేదు. ఎన్నేళ్ల సర్వీస్ ఉంటే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చో స్పష్టత ఇవ్వలేదు.
వారసత్వ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం
1998 నుంచి సింగరేణిలో రద్దయిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ 2016 దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో రెండేళ్ల సర్వీస్ ఉన్న ప్రతి కార్మికుడు తన వారసులకు బొగ్గు గనుల్లో అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన నోటిఫికేషన్ అది. దీంతో సింగరేణిలో కార్మికులు, వారసులు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. అయితే, ఈ నోటిఫికేషన్‌పై గోదావరిఖనికి చెందిన ఓ నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో హైకోర్టు వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను కొట్టేసింది. దీనిపై సింగరేణి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో గత అక్టోబర్‌లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలకు బదులు కారుణ్య నియామకాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానాన్ని సింగరేణిలో అమలు చేస్తామన్నారు. దీంతో సింగరేణి ఎన్నికల్లో అధికారిక టీబీజీకేఎస్ యూనియన్ ఘన విజయం సాధించింది.
‘మెడికల్ అన్‌ఫిట్’ కొత్తేం కాదు
సింగరేణిలో కార్మికుడు చనిపోతే డిపెండెంట్ కింద భార్య, కొడుకు, కూతురులలో ఒకరికి ఉద్యోగం కల్పించే ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ‘మెడికల్ అన్‌ఫిట్’విధానం ద్వారా కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే విధానం కూడా పాతదే. కార్మికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పనిచేయలేని స్థితికి చేరినప్పుడు గానీ, పక్షవాతం, కుష్టు, క్యాన్సర్, టీబీ, గుండె వ్యాధులకు గురై విధుల నిర్వహణకు పనికిరాడని తెలిసినప్పుడుగానీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధానం ఉంది. కొత్తగూడెంలోని సింగరేణి మెడికల్ బోర్డు కార్మికుడు వైద్యపరంగా నిస్సహాయుడు అని నిర్ధారిస్తూ ‘మెడికల్ అన్‌ఫిట్’సర్టిఫికెట్ ఇస్తే డిపెండెంట్‌కు ఉద్యోగం వస్తుంది.
కొత్త రోగాలు.. అన్‌ఫిట్ విధానాలేవీ?
శనివారం సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన సర్క్యులర్‌లో కారుణ్య నియామకాలకు సంబంధించి కొత్తగా విధివిధానాలేవీ రూపొందించలేదు. ‘మెడికల్ ఇన్‌వాలిడేషన్’ద్వారానే కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్న సంస్థ ‘ఇన్‌వాలిడేషన్’కు ఏయే రోగాలను చేరుస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆరు రోగాలకు మాత్రమే మెడికల్ ఇన్‌వాలిడేషన్‌కు అవకాశం ఉంది. ‘మెడికల్ ఇన్‌వాలిడేషన్’కు అర్థాన్ని వివరిస్తూ.. ‘వైద్యపరంగా పూర్తిగా సామర్థ్యరహితమై ఉద్యోగం కోల్పోయి కుటుంబానికి భారంగా మారడం’అని సంస్థ పేర్కొనడం గమనార్హం.
2017 దరఖాస్తుదారులకు అవకాశం లేనట్టే!
గత నెల 27న శ్రీరాంపూర్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గతంలో వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసు కున్న వారంతా ఇప్పుడు మళ్లీ కారుణ్య నియామకాలకు దర ఖాస్తు చేసుకొని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. గతంలో సంస్థ జారీ చేసిన సర్క్యులర్ల రిఫరెన్స్ ప్రకారం కార్మికునికి కనీసం రెండేళ్ల సర్వీసు మిగిలి ఉండాలి. డిపెండెంట్ వయస్సు 35 దాటకూడదు. కానీ 2017లో దరఖాస్తు చేసుకున్న వారంతా ఏడాది, రెండేళ్లలోపు సర్వీసు మిగిలి ఉన్నవారే. వీరిలో చాలా మంది ఇప్పటికే రిటైర్డ్ అయ్యారు. ఏడాది గడువున్న వారికి కూడా ఇప్పుడు అవకాశం రాదు.
Comments
Please login to add a commentAdd a comment