ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు | The identity of the trade unions | Sakshi
Sakshi News home page

ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు

Published Sat, Jan 21 2017 3:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు

ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు

ఇకపై ఆర్టీసీ తరహాలో విద్యుత్‌ సంస్థల్లో ఎన్నికలు

  • విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల నిర్ణయం.. కసరత్తు ప్రారంభం
  • ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కేవీ, 1104, 327 సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు
  • ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కం సంస్థల్లో ఎన్నికల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో టీఆర్‌ఎస్‌కేవీ, 1104, 327 అనే మూడు ప్రధాన కార్మిక సంఘాలు గుర్తింపు సంఘాలుగా కొనసాగుతుండగా, ఇకపై ఆర్టీసీ తరహాలో ఒకే సంఘానికి గుర్తింపు కేటాయించాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. విద్యుత్‌ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు యాజమాన్యాలు మూడు గుర్తింపు సంఘాలతో చర్చలు జరపాల్సి వస్తోంది. అయితే సంఘాలమధ్య సమన్వయం లేక పలు సందర్భాల్లో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు.

డిసెంబర్‌లో కార్మిక సంఘాలన్నీ ఏకమై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌ (టఫ్‌)గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వడం యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం కొన్ని సంఘాలు సమ్మె పిలుపును విరమించుకోగా, కొన్ని సంఘాలు నిరాకరించడంతో టఫ్‌లో చీలిక వచ్చింది. దీంతో ఒక్కో కార్మిక సంఘాన్ని బుజ్జగించి సమ్మె పిలుపును విరమింపజేయడానికి యాజమాన్యాలు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చల కోసం ఒకే సంఘానికి గుర్తింపు కల్పించాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి.

రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో), విద్యుత్‌ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)లలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ ను ఇటీవల ట్రాన్స్‌కో యాజమాన్యం కోరిం ది. తాజా నిర్ణయం ప్రకారం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి, ఒకే కార్మిక సంఘానికి గుర్తింపునిస్తారు.

కసరత్తు ప్రారంభించిన కార్మిక శాఖ...
ట్రాన్స్‌కో విజ్ఞప్తి మేరకు విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. కార్మికుల వివరాలు (మస్టర్‌ రోల్స్‌)ను అందించాలని తాజాగా విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలను కోరింది. అదే విధంగా విద్యుత్‌ కార్మిక సంఘాల్లో సభ్యుల వివరాలను అందించాలని ఆయా కార్మిక సంఘాలకు తాజాగా లేఖలు రాసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల వారీగా కేంద్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బందితో పాటు అకౌంట్స్, ఇతర విభాగాల్లోని ఎల్‌డీసీ, యూడీసీ, జేఏఓ, రికార్డ్‌ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్‌ సబార్డినేట్‌ స్థాయి వరకు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులు కానున్నారు. ట్రాన్స్‌కో అధికారవర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని నాలుగు విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 20 వేల మందికి పైగా కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటేయనున్నారు. దీంతో ఆర్టీసీ, సింగరేణి సంస్థల తరహాలోనే ఇకపై విద్యుత్‌ సంస్థల్లో కూడా ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికల సందడి నెలకొననుంది.

సర్కిల్‌/డివిజన్‌ స్థాయిలో ఎలా..?
విద్యుత్‌ సంస్థల్లో కేంద్ర/రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ, సర్కిల్, డివిజన్‌ స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాలేదు. జెన్‌కోలో విద్యుత్‌ కేంద్రాల పరిధిలో, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో సర్కిల్, డివిజన్‌ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ట్రాన్స్‌కోవర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement