సాక్షి, విజయవాడ : సీఆర్‌డీఏ నోటీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై లింగమనేని రమేశ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచూసుకోవాలన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు గతంలో లింగమనేని చెప్పారని అన్నారు. కానీ లింగమనేని ఇప్పుడు మాటమార్చి.. ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. కొత్తగా ఆ ఇళ్లు తనదేనని లింగమనేని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానిదేనని చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన శాసనసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు లింగమనేనిని భయపెట్టి రకరకాలుగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలన్నారు. చంద్రబాబు ఖాళీ చేయని పక్షంలో ఆ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కరకట్టపై నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షర్హులేనని చెప్పారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. డబ్బుతో ప్రలోభ పెట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎన్నికల్లో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment