
సాక్షి, హైదరాబాద్ : గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పొరపాటేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. అప్పుడున్న పరిస్థితుల్లో తప్పక టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీని ఎదగకుండా సీఎం చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని.. టీడీపీ పొత్తు బీజేపీకి గుదిబండలా తయరైందని వ్యాఖ్యానించారు. జీవీఎల్‌తో ఆదివారం సాక్షి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. టీడీపీతో పొత్తు వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ లేకుండా టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని.. చంద్రబాబుది అవకాశ రాజకీయమని విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ ఆలోచనల ఏం మారలేదని, హోదా కాకుండా ప్యాకేజీ కావాలని అడిగింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఏపీ అభివృద్దికి బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘హోదాపై రెండు మాటలు మార్చింది చంద్రబాబే. ఆనాడు హోదా వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. హోదా కోసం ఉద్యమాలు చేస్తే జైల్లో పెడతామన్నది చంద్రబాబు కాదా?. ఆయన రోజుకో నాటకం ఆడుతున్నారు. చంద్రబాబుకు స్వార్థ ప్రయోజనాలే తప్ప.. విలువలు లేవు. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రశ్నించినా జవాబు చెప్పే సత్తా సీఎంకు ఉండాలి. టీడీపీ అవినీతిపై ప్రశ్నిస్తే వారు మాపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో లూటీ పాలన కొనసాగుతోంది. ప్రతీ స్కీంలో స్కాం జరుగుతోంది. చినామీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఐటీ దాడులు జరగడం సహజం. తప్పు చేయని వారు ఐటీ దాడులకు ఎందుకు భయడుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే కేంద్రంపై ఆరోపణలు. కేంద్ర యూసీలు అడిగితే చంద్రబాబు ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి అవసరమైన నిధులు ఇచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment