
చీరాల: టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గమైన వ్యవహారాలు, అక్రమాల గురించి తాను నిజంగా నోరు విప్పి అన్నీ చెబితే సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొడతారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. చంద్రబాబు నిజంగానే కష్టపడ్డారని, కాకపోతే అందులో 95 శాతం తన అనుకూల వర్గానికి రాష్ట్రాన్ని దోచిపెట్టేందుకే కష్టపడ్డారని పేర్కొన్నారు. మంగళవారం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని తన నివాసం సమీపంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు, పోలింగ్ ఏజెంట్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై తాను కొన్ని విషయాలను బహిర్గతం చేస్తే అవి నిరాధారమైన ఆరోపణలని ఒక్కరు కూడా ఖండించలేకపోయారని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబు చీరాల వచ్చి ఆమంచిపై నేనే కేసులు పెట్టించానని ప్రకటించడాన్ని చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత నీఛంగా ఉందో ప్రతిఒక్కరు అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే కేసులు పెట్టించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఓడిపోతామని భయపడి టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు చీరాలలో ఎవరూ ముందుకు రాకపోవడంతో బలరాంను తెచ్చి తనపై పోటీకి నిలబెట్టారన్నారు.
రైతు కూలీ కొడుక్కి జగన్ ఎంపీ సీటిచ్చారు: నందిగం సురేష్
బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ మాట్లాడుతూ.. అనుభవం ఉందని, అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎలాంటి మాయమాటలు చెప్పాడో అందరికీ తెలుసన్నారు. ఆయన కేవలం పోలీసులతోనే పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు పీడ వదిలిపోనుందని, ఇక భవిష్యత్తు జగన్‌దేనని స్పష్టం చేశారు. ఓ రైతు కూలీ కొడుకును ఎంపీ చేయాలనే గొప్ప మనసుతో తనకు ఎంపీ సీటిచ్చారన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనను, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.