సాక్షి, తాడేపల్లి : నాగార్జునరెడ్డి గురించి చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నాగార్జున రెడ్డిపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నాగార్జున అనే వ్యక్తి జర్నలిస్ట్ కాదని.. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన, తన కుటుంబం గురించి నాగార్జున ఫేస్‌బుక్‌లో తప్పుడు తప్పుడు రాతలు రాశారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులను సైతం లుచ్చా, కొజ్జా అని పేర్కొంటూ రాసిన ఘనత అతడికే చెల్లిందన్నారు. చంద్రబాబు చచ్చిపోయిన విష సర్పం వంటి వాడని... తన చేతిలో మీడియా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున గురించి తాను చెప్పిన వాస్తవాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయగలవా అని ప్రశ్నించారు.
అతడిపై 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి
‘నాగార్జున సూడో నక్సలైట్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడు. భార్యను వేధించిన ఘటనలో అతడిపై కేసు నమోదు అయింది. గతంలో మహిళా ఉద్యోగుల గురించి చెప్పరాని భాషలో తప్పుడు కథనాలు రాశాడు. అంతేకాదు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసు కూడా అతడిపై ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్‌గా పనిచేసిన నాగార్జున.. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నాడు. నాగార్జునపై మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి’ అని ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు.
ఆ రిపోర్టర్‌ను హత్య చేయించింది మీరు కాదా?
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి వంతమైన పాలన చూసి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని సీఎం జగన్‌కు అంటగడుతున్నారు. ప్రస్తుతం నాగార్జునరెడ్డిపై దాడి కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ టీడీపీ నేత పుల్లారావు అంధ్రప్రభ రిపోర్టర్ శంకరయ్యను హత్య చేయించినపుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు. నిజానికి చంద్రబాబు టీడీపీలో కీలకంగా ఉన్న సమయంలో రంగ హత్య జరిగింది. రంగాను హత్య చేసిన వారికి శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారు. ప్రస్తుతం కుటుంబ తగాదాలకు కూడా చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారు. చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకోలేదా.. ఆయన శవం ముందు విక్టరీ సింబల్ చూపించి శవ రాజకీయాలు చేయలేదా’ అని ఆమంచి కృష్ణమోహన్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment