సాక్షి, అమరావతి : వరుస కార్యక్రమాలు, సమీక్షలు, విదేశీ పర్యటనలతో బిజీబిజీగా ఉంటోన్న మంత్రి నారా లోకేశ్.. చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. సోమవారం అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనంలో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు.
ఎల్లయ్యో, మల్లయ్యో అడిగితే చెప్పాలా? : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా ముఖ్యమన్న లోకేశ్.. ఆ అంశంతోపాటు విభజన చట్టంలోని ఇతర హామీలపైనా కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో, ఎంత ఇచ్చిందో వాస్తవావాస్తవాలన్నీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు చేసిన ‘కర్నూలు డిక్లరేషన్’ను చూసి తాను ఆశ్చర్యపోయానని మంత్రి అన్నారు. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందింది. అలా కాదంటూ ఎవరో ఎల్లయ్యో, మల్లయ్యో రాయలసీమ డిక్లరేషన్ పెడితే దాని గురించి నేను మాట్లాడాలా?’’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
దేశానికి రెండో రాజధానిగా కర్నూలు : భారతదేశానికి దక్షిణాదిలో రెండో రాజధాని ఉండాలన్న వాదనను తాను సమర్థిస్తానని లోకేశ్ చెప్పారు. ‘మన కర్నూలును దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుంద’ని అన్నారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తు : ఇటీవలే తెలంగాణలో పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పొత్తులు ఉంటాయని ప్రకటించినదానికి విరుద్ధంగా లోకేశ్ స్పందించారు. టీఆర్‌ఎస్‌తోనే పొత్తు ఉంటుందని సీఎం ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment