సాక్షి, అమరావతి: లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు అందజేయడం ఒక అద్భుతమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం నెలకొందని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అన్నారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ తమ సత్తా చాటిందని ప్రశంసించారు. పొద్దు పొడవకముందే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మధ్యాహ్నంకల్లా పూర్తయిందన్నారు. దాదాపు 60 లక్షల మందికి రూ.1,384 కోట్లు పంపిణీ చేశారని తెలిపారు.
నిజమైన ప్రజా పరిపాలన అంటే ఇదేనన్నారు. చంద్రబాబు సర్కారు హయాంలో పింఛన్ల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేదని, క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేదని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీలో అవినీతికి సైతం పాల్పడేవారని పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పింఛన్లు అందడం శుభ పరిణామమని కొనియాడారు. ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తుండడంతో లబ్ధిదారులంతా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనస్సుతో దీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల చెంతకే తీసుకెళ్లి చరిత్ర సృష్టించబోతోందని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌కు శత్రువులు లేరు
రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవటం రాష్ట్రానికి శుభ పరిణామమని అంబటి రాంబాబు చెప్పారు. పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయని చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేశారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు శత్రువులు ఎవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అమరావతి ప్రాంతంలో పేదలకు భూమి ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఒక వర్గం వాళ్లే రాజధానిలో ఉండాలా? పేదలకు రాజధానిలో స్థలం ఉండకూడదా? అని నిలదీశారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని చెప్పారు. అమరావతి రాజధాని విషయంలో కానిస్టేబుల్‌పై దాడి చేశారని, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై దాడి చేశారని, ఇది దౌర్జన్యం కాదా? అని ప్రశ్నించారు. కేవలం విశాఖపట్నంలో చెప్పులు వేయడమే దౌర్జన్యమా? అని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట? అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్ల పంపిణీ ఒక అద్భుతం
Published Mon, Mar 2 2020 5:12 AM | Last Updated on Mon, Mar 2 2020 5:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment