
సాక్షి, హైదరాబాద్: ‘‘సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) లక్ష్మీనారాయణ.. చంద్రబాబు నాయుడు అప్పట్లో తోడు దొంగలుగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నించారు. వాళ్లిద్దరి మధ్య ఇన్నాళ్లూ సాగిన రహస్య బంధాలపై విచారణ జరపాలి. అప్పుడు వారి ముసుగు తొలిగి మరిన్ని నిజాలు బయటపడతాయి. చిత్తశుద్ధి ఉంటే వారిద్దరూ విచారణకు సిద్ధంగా ఉండాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్న వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళ్తున్న వ్యక్తిని ఎంతో దుర్మార్గంగా వేధించిన వారిని ప్రజలు శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఓటునే ఆయుధంగా ఉపయోగించి, బ్యాలెట్ ద్వారా శిక్షించాలని పిలుపునిచ్చారు. నిజానికి ఆ కేసుల్లో విచారణ జరగాల్సింది జగన్‌మోహన్‌రెడ్డిపై కాదని, లక్ష్మీనారాయణ, చంద్రబాబుపైనే జరగాలని స్పష్టం చేశారు.
జగన్‌ను అణగదొక్కడానికి కుట్ర
‘‘ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను రాజకీయంగా అణగదొక్కడానికి ఎనిమిదేళ్లపాటు టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేశాయి. విచారణ పేరుతో జగన్‌ను జైలులో పెట్టించారు. కుట్రపూరితంగా చంద్రబాబు ఏది ఆదేశిస్తే లక్ష్మీనారాయణ అదే చేశారు. టీడీపీ నేతలు, వారి అనుకూల పత్రికలు లక్ష్మీనారాయణను గొప్పగా చిత్రీకరించాయి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సైకిలెక్కి భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. దీన్నిబట్టి వారి బంధం ఏనాటిదో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ను అణచివేసేందుకు జరిగిన కుట్రలో లక్ష్మీనారాయణది ప్రధాన పాత్ర’’ అని అంబటి విమర్శించారు.
జగన్‌ను వేధిస్తే వైఎస్సార్‌సీపీ ఉండదనుకున్నారు
‘‘జగన్‌మోహన్‌రెడ్డిని వేధించి, కుట్రలు చేసి కేసులు పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిరైపోతుందని భావించారు. కానీ, చంద్రబాబు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేకపోయారు. ఎంతగా వేధించినా మొక్కవోని ధైర్యంతో పార్టీ ముందుకు సాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, జగన్ కష్టం, కార్యకర్తల కృషి ఇందుకు కారణం. అప్పట్లో ఆ రెండు పత్రికలు వాస్తవాలను అవాస్తవాలుగా... అవాస్తవాలను వాస్తవాలుగాను వండి వార్చాయి. ఆ రెండు పత్రికలు చంద్రబాబుకు బాకా ఊదే పత్రికలనే విషయం అందరికీ తెలుసు’’ అని అంబటి పేర్కొన్నారు.