
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం గురువారం జరగనుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సంస్థాగత ఎన్నికలు, తదుపరి అధ్యక్షుడి ఎన్నికపై చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారుపై సమాలోచనలు జరపనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా ఆర్గనైజేషన్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఆర్గనైజేషన్ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్ష పదవికి అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను ప్రతిపాదించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రతిపాదనను బలపరుస్తూ రాష్ట్రాల అధ్యక్షులు తీర్మానం చేయనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై నుంచి చేపట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుగానే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment