న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరుతోంది. బుధవారం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. యమునా నది కాలుష్యం గురించి మాట్లాడిన షా.. కేజ్రీవాల్‌కు ధైర్యం ఉంటే చొక్కా విప్పి.. ఒక్కసారి అందులో మునిగి చూడాలని అన్నారు. అలాగైతే యమునా నదిలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఆయనకు తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆప్ నేతలు యమునా నదిని శుభ్రపరుస్తామని చెప్పారు. అయితే కేజ్రీవాల్‌కు నేను మీకు ఈ రోజు సవాలు విసురుతున్నాను. మీరు మీ చొక్కా విప్పి.. యమునా నదిలో ఒక్కసారి మునిగి చూడండి. అప్పుడు ఆ నదిలో నీరు ఎంత కలుషితమైందో మీకే తెలుస్తుంద’ని అమిత్ షా అన్నారు.
కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే యమునా నది శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ప్రజలు కాలుష్యం లేని యమునా నదిలో దిగి స్నానం చేసేలా చేస్తామని అన్నారు. అలాగే సామాన్య ప్రజలతో కలిసి తాను కూడా యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కేజ్రీవాల్‌కు సవాలు విసిరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రానికి కేజ్రీవాల్ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment