
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షాలు ఫరూక్ అబ్దుల్లా గురించి ప్రశ్నించగా.. ఆయనను అరెస్ట్ చేయలేదు.. నిర్భందంలోకి కూడా తీసుకోలేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్‌కు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులను ఆదివారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అమిత్ షా మంగళవారం సభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సులే.. ‘ఫరూక్ అబ్దుల్లా నా పక్కనే కూర్చునే వారు.. కానీ నేడు ఆయన సభకు హాజరుకాలేదు’ అని తెలిపారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ఫరూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయలేదు.. నిర్భందించలేదు. ఆయన కావాలనే ఇంట్లో ఉన్నారన్నా’రు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాలేదా అని సుప్రియా ప్రశ్నించగా.. నేను వైద్యుడిని కాదంటూ అమిత్ షా సమాధానమిచ్చారు.
ఫరూక్ అబ్దుల్లా సభకు హాజరు కాలేదనే అంశాన్ని తొలుత డీఎంకే గుర్తించింది. ఆయన ఎక్కడున్నారని, ఆయనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఆ పార్టీ సభ్యుడు దయానిధి మారన్ స్పీకర్‌కు తెలిపారు. సభలోని సభ్యులను రక్షించే బాధ్యత స్పీకర్‌దే అన్నారు మారన్. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. స్థానిక నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, తదితర నేతలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.