సాక్షి, నెల్లూరు : ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించడం దారుణమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా పతనం కావడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... తొమ్మిది నెలల్లో తీసుకోవాల్సిన అప్పులను ఒక నెలలోనే బహిరంగ మార్కెట్ నుంచి తీసుకుని ప్రభుత్వం.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ ప్రతి నెలా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కింద మొత్తం 26 వేల 22 కోట్ల రూపాయలను ప్రభుత్వ తీసుకుంది. వేస్ అండ్ మీన్స్ కింద గత రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. చేసిన అప్పులతో తమకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోంది. చివరి సంవత్సరంలోనే ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. పుట్టబోయే బిడ్డ మీద కూడా 40 వేల రూపాయల మేర అప్పు ఉంది’ అని ఆనం పేర్కొన్నారు.
ప్రశ్నించిన సీఎస్‌పై విమర్శలా?
చంద్రబాబు చేసిన ఆర్థిక తప్పిదాలను ప్రతి నిపుణుడూ విమర్శిస్తున్నారని రామనారాయణ రెడ్డి అన్నారు. ‘ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఆర్థిక శాఖలోని విభాగాలను ఎన్నారై వాసిరెడ్డి కృష్ణ దేవరాయలు నిర్వహించారు. సి.ఎఫ్.ఎం.ఎస్.ను ఏర్పాటు చేసి దానిని కృష్ణదేవరాయలు చేతిలో పెట్టారు. ఆర్థికశాఖ లో అవకతవకలను ప్రశ్నించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విమర్శించిన సీఎం, ఆర్థిక మంత్రి తీరు సరికాదు. ఆర్థిక శాఖలో అవకతవకలను చూసి ఐఏఎస్ అధికారులు సెలవుపై పోతున్నారు. టీటీడీ బంగారం తరలింపులో సూత్రధారులు, పాత్రధారులను బయట పెట్టాలి. ఆర్థికశాఖ తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. ’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment