జెండాపై పరిటాల ! | Anantapur In Land Scam | Sakshi
Sakshi News home page

జెండాపై పరిటాల !

Published Wed, Apr 11 2018 9:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

Anantapur  In Land Scam - Sakshi

పేదలు ఓ గుడిసె వేసుకుందామనుకునే లోపు అక్కడ ఓ పచ్చని జెండా రెపరెపలాడుతుంది. అందునా దానిమీద పరిటాల పేరు. ఇంకేముంది.. ఆ వైపు వెళ్లేందుకు కూడా సామాన్యులు జంకే పరిస్థితి. నగర శివారులో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోనీ అధికారులకు చెప్పుకుందామంటే వాళ్లూ అందులో భాగస్వాములే. నాయకుల వద్దకు వెళ్దామంటే వ్యవహారమంతా వారి కనుసన్నల్లోనే. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది.

రాప్తాడులో కబ్జాల రెపరెపలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం చుట్టుపక్కల అధికార పార్టీ నేతల భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. రూరల్‌ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్‌ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అనంతపురం కార్పొరేషన్‌కు అతి సమీపంలోని ఈ భూముల విలువ రూ. కోట్లలో ఉంటోంది. అయితే అధికారులు కూడా ఈ దందాను అడ్డుకోలేకపోతుండటం గమనార్హం. ఇందులో భాగంగా అక్రమార్కులు ముందుగానే అధికారులతో మంతనాలు సాగిస్తున్నారు. ఆ తర్వాత అంతోఇంతో ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. నగరం చుట్టూ బుక్కరాయసముద్రం మినహా తక్కిన ప్రాంతమంతా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నగర శివారులో ఎక్కడ చూసినా సెంటు స్థలం రూ.7లక్షల నుంచి రూ.15లక్షల పైమాటే. ఆయా ప్రాంతాల్లో ఖాళీ జాగా కనిపిస్తే టీడీపీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. ఈ పంచాయతీల పరిధిలోని వీఆర్వోలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఖాళీ స్థలాల సమాచారం పసిగడుతున్నారు. ఆ తర్వాత బడా నేతల ఆశీర్వాదంతో జెండా పాతేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కబ్జాలన్నీ ఇదే తరహాలోనివే.
బీసీ భవన్‌ తెరమరుగేనా?
సోములదొడ్డి ప్రాంతంలో ఓబుళయ్య, తిరుపాలు, నారాయణస్వామి, వెంకటేశ్‌ అనే నలుగురు వ్యక్తులకు 4.09 ఎకరాల పొలం ఉంది. వీళ్ల పూర్వీకులకు ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. ఇందుకు పాసు పుస్తకాలను కూడా జారీ చేసింది. సర్వే నెంబర్‌ 97–1లోని ఈ పొలంలో ఓబుళయ్య, తిరుపాలు పేరుతో 0.82 ఎకరాలు, నారాయణస్వామి, వెంకటేశ్‌ పేరుతో 1.63 ఎకరాల పొలం ఉంది. ఇళ్లులేని పేద కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం కొందరు గ్రామపెద్దల సమక్షంలో ఈ నలుగురిని సంప్రదించారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు లేవని, మీ పొలాలను ఇళ్లస్థలాల కోసం ఇస్తే ఆ భూములను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇందుకు వారు అంగీకరించారు.

2012లో 4.09 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికే స్వాధీనం చేస్తూ పాసుపుస్తకాలు, సంబంధిత రికార్డులు, తహసీల్దార్‌కు సమర్పించారు. ఆ మేరకు 129 మందికి 2013 మార్చి 15న అప్పటి తహసీల్దార్‌ బలరామిరెడ్డి, ఆర్డీఓ హుస్సేస్‌సాహెబ్‌ ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. 4.09 ఎకరాల కొనుగోలు సొమ్మును ఈ 129 మంది కలిసి చెల్లించారు. స్థలాలు రావడంతో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే నిర్మించుకోవచ్చని జన్మభూమిలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ స్థలాన్ని పామురాయి వెంకటేశ్‌ పేరుతో జెండాలు పాతి స్వాధీనం చేసుకోవాలని యత్నించారు. ఇంతలో ఆ స్థలాన్ని అప్పటి కలెక్టర్‌ శశిధర్‌ బీసీ భవన్‌ నిర్మాణానికి కేటాయించారు. అయితే ప్రభుత్వం బీసీ భవన్‌ ప్రతిపాదనను పక్కనపెట్టింది. ఈ భూమిలో కొంతమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, బీసీ భవన్‌కు మరోచోట స్థలం ఇవ్వొచ్చని ఓ ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇళ్లస్థలాల పేరుతో అస్మదీయులకు స్థలాన్ని కట్టబెట్టేందుకే బీసీ భవన్‌ ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.
రాప్తాడు నియోజకవర్గంలో మరికొన్ని కబ్జాలు ఇవే..
ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఈ గ్రామంలోని దళితులు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. ఆ భూమిని తహసీల్దార్‌కు స్వాధీనం చేసి ఆ స్థలంలో పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఈ భూమిలో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి స్థలం కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. 
జేఎన్‌టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి నారాలోకేశ్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఈ స్థలం విలువ కోట్లలోనే ఉంటుంది. అనంతపురం సమీపంలోని కక్కలపల్లి వద్దనున్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వారికి పట్టాలిప్పిస్తామని అప్పట్లో పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత 2014లో మొత్తం ఇళ్లను పోలీసుల అండతో కూల్చేశారు. మంత్రి బంధువులు మురళీ, మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో బాధితులు ఆరోపించారు.

ఈ ఫొటోలో పరిటాల, పామురాయి వెంకటేశ్‌ పేరుతో కనిపిస్తున్న పచ్చ జెండాలు అనంతపురం రూరల్‌ పరిధి సోములదొడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఏడాదిన్నర కిందట నాటారు. 2013లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలిచ్చిన 4.90 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈ కబ్జాకు తెగించారు.

ూ కక్కలపల్లిలోని ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఏడాది కిందట కొందరు టీడీపీ నేతలు పరిటాల రవీంద్రకాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మూడెకరాలను స్వాధీనం చేసుకునే కుట్రతోనే ‘తమ్ముళ్లు’ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

బీసీ భవన్‌ స్థలాన్ని రద్దు చేయలేదు 
సోములదొడ్డి రెవెన్యూ గ్రామంలో బీసీ భవన్‌ కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయలేదు. ఆ స్థలాన్ని గతంలో ఇంటి పట్టాలు మంజూరు చేశాం. అయితే నిర్ణీత గడువులోపు ఎవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు పట్టాలను రద్దు చేసి ఆ స్థలాన్ని బీసీ భవన్‌ కోసం కేటాయించాం. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన రైతులు కోర్టులో కేసు వేశారు. విచారణ జరుగుతోంది.

– మలోల, ఆర్డీఓ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement