సాక్షి, అమరావతి : ఒక పార్టీ అధ్యక్షుడు... రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తే ఏమవుతుంది? రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, సంఘ విద్రోహక శక్తులకే ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కుతుంది. అంతేనా? ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ అరాచక శక్తులనే బరిలో దించుతారు. వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా అన్ని అడ్డదారులు తొక్కుతారు. ఇక గెలిచాక ఆ అభివన రాక్షసులు జన ధన, మాన, ప్రాణాలు కాజేసే కిరాతకులుగా మారతారు. ఇక ఆ అరాచకానికి అంతుండదు.
రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు జరిగింది ఇదే! తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన చింతమనేని దుశ్శాసనుడిని తలపిస్తే... దళిత మహిళను వివస్త్రను చేసి చితకబాదించిన బండారు సత్యన్నారాయణమూర్తి కాలకేయుడికి ప్రతిరూపంగా నిలిచారు. పోలీసులపైనే దాడులకు తెగబడి జేసీ బ్రదర్స్ శాంతిభద్రతలను అపహాస్యం చేస్తే, యథేచ్ఛగా హత్యలు చేయిస్తూ పోలీసులకే సవాల్ విసిరారు పరిటాల శ్రీరామ్.ఇలాంటి అరాచకవాదులు ఎందరో.. మరెందరో ఉన్న టీడీపీని సాగనంపుదాం.. వారిని ఓటు అనే అంకుశంతో పొడవాల్సిన రోజిదే.
అభివన దుశ్శాసనుడు ..చింతమనేని
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ముసునూరు తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టి మరీ ఈడ్చేసిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినవ దుశ్శాసనుడితో పోలికకూ ఇంకాస్త ఎక్కువే. ఇలాంటివాడికి ప్రభుత్వ ‘విప్’గా పదోన్నతి కల్పించి ధృతరాష్ట్రుడికి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదే దన్నుగా చింతమనేని చెలరేగిపోయారు. ‘ఎస్సీలు మీకు ఎందుకురా రాజకీయాలు’ అంటూ ఆ సామాజికవర్గ ప్రజలను కించపరుస్తూ దుర్భాషలాడరు. పెదపాడు మండలంలో ఉద్యోగులను ‘నా కొడకల్లారా, మీ అంతు చూస్తా.. తేడా వస్తే కేసులు పెట్టి జైళ్లలో తోయిస్తా’ అని నోరు పారేసుకున్నారు. గతంలో మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత కుమార్‌పై దాడి చేసిన కేసు సహా తీవ్రమైన నేరారోపణలతో 26 కేసులున్న చింతమనేనికి కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఇప్పటికీ ఏలూరు మూడో పట్టణ ఠాణాలో ఇతడిపై రౌడీ షీట్ ఉంది. అలాంటివాడిని దూరం పెట్టాల్సింది పోయి.. ముద్దు చేశారు సీఎం చంద్రబాబు. మళ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా నేరగాళ్లకే తాను వెన్నుదన్నుగా నిలుస్తానని చాటుకున్నారు.
...ఈ కౌరవ సంతతి వ్యక్తిని మళ్లీ పవిత్ర అసెంబ్లీకి పంపుదామా?
‘కాలకేయ’ వారసులు..జేసీ బ్రదర్స్
వారి నోరంతా దురుసుతనమే. వారి తీరంతా దుందుడుకే. వారే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి. తమకు లొంగనివారిని ఎంతగా వేధిస్తారో, భయభ్రాంతులకు గురిచేస్తారో తాడిపత్రిలోని ఆశ్రమ ఉదంతమే నిదర్శనం. ఆశ్రమ నిర్వాహకుడితో తలెత్తిన వివాదంలో తనకు సహకరించలేదంటూ దివాకర్‌రెడ్డి పోలీసులను దుర్భాషలాడుతూ దాడికీ తెగబడ్డారు. తన అనుచరులపై కేసు పెట్టారంటూ తాడిపత్రి ఠాణాకు తాళాలు వేసి పోలీసులపై వీరంగం వేశారు ప్రభాకర్‌రెడ్డి. సమాజాన్ని రక్షించే పోలీసులపైనే దాడులకు తెగబడ్డారంటే జేసీ సోదరులు సాధారణ ప్రజలను ఏ రీతిలో వేధిస్తారో అర్థం చేసుకోవచ్చు. తాడిపత్రికి తానే రౌడీనంటూ పలుమార్లు సొంత సర్టిఫికెట్ ఇచ్చుకున్న ఘనుడు ప్రభాకర్‌రెడ్డి. ఈ కాలకేయులకు అన్నివిధాల అండగా నిలిచిన చంద్రబాబు... దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌ను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా, ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌ను తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించారు.
...ఈ కాలకేయ వారసత్వాన్ని స్వాగతించి, దౌర్జన్యకాండకు మరో బీజం వేద్దామా?
అసుర.. అసుర.. రావణ.. పరిటాల శ్రీరామ్
రాజకీయ అరంగేట్రానికి ముందే హత్యలు, హత్యాయత్నాల్లో ప్రధాన భూమిక పోషించడం ద్వారా పరిటాల శ్రీరామ్ తన తండ్రి పరిటాల రవిని మించినవాడినని నిరూపించుకున్నాడు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిని హత్య చేయడం, కందుకూరులో రైతు శివారెడ్డిని కిరాతకంగా తుదముట్టించడం, కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుల్లో శ్రీరామ్‌పై ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఇప్పుడు మంత్రి పరిటాల సునీతను పక్కనపెట్టి మరీ ఆమె కుమారుడు శ్రీరామ్‌ను రాప్తాడు నుంచి పోటీకి దించారు. తద్వారా వర్గ పోరాటాలకు దగ్గరుండి మరీ ఆజ్యం పోస్తున్నారు.
...ఇలాంటివారికి ఓటేసి రావణ రాజ్యానికి మనమే పునాది వేద్దామా?
రాజకీయ విలన్... బాలకృష్ణ
ఆయన తెరపైనే హీరో. నిజ జీవితంలో మాత్రం సాధారణ ప్రజలే కాదు... పార్టీ కార్యకర్తలన్నా లెక్క లేదు. ఎక్కడపడితే అక్కడ దాడులకు పాల్పడుతూ ప్రజా జీవితంలో విలన్‌లా వ్యవహరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సీఎం చంద్రబాబుకు బావమరిది, వియ్యంకుడు కూడా. మూడేళ్ల క్రితం మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తన నియోజకవర్గం హిందూపురానికి చుట్టపుచూపుగా వచ్చే ఈ నందమూరి వారసుడు.. పీఏలతో పాలన నడిపించి అభాసు పాలయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ విచ్చలవిడిగా దాడికి తెగబడ్డారు. అయినా ఆయన్ను మరోసారి పోటీకి దించారు చంద్రబాబు.
...రాజకీయాల్లో విలనిజాన్ని నమ్ముకుందామా? మంచివాడికి పట్టం కడదామా?
విషపూరిత కోడె నాగు.. కోడెల
పైకి ఒకలా కనిపిస్తూ, లోపల ఒకలా వ్యవహరించడం కోడెల శివప్రసాదరావు నైజం. 2004 వరకు నరసరావుపేట నియోజకవర్గంలో ఈయన చేయని దురాగతం లేదు. తన ఇంట్లో బాంబులు పేలిన వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని భావించి... ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులను తీసుకెళ్తున్న వాహనంపై కిరాయి మూకలతో రాడ్లు, కత్తులతో దాడి చేయించారు. ఈ ఐదేళ్లలో స్పీకర్ హోదాలో కోడెల వ్యవహార శైలి, ఆయన సంతానం అవినీతి, ‘కె’ ట్యాక్స్ తీవ్ర విమర్శల పాలైంది. అయినా సత్తెనపల్లి నుంచి మరోసారి బరిలో దింపారు.
...ఈ ఆశ్రిత పక్షపాత, నిరంకుశ, అవినీతిని ఉపేక్షిద్దామా?
‘నరకా’సురుడు... వరదాపురం సూరి
‘ఎన్నికల్లో గెలిచాక ఆరు నెలలు మీకు స్వేచ్ఛనిస్తా. ప్రత్యర్థుల కాళ్లు విరుస్తారా? నరుకుతారా? మీ ఇష్టం!’ ఇవి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) మాటలు. రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి అడ్డు తొలగించుకోవడంలో ఈయన నరరూప రాక్షసుడు ఈ రౌడీ షీటర్. ఇటీవల కార్యకర్తల సమావేశంలో రక్తపాతానికి దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటివాడినే ధర్మవరం నుంచి మళ్లీ బరిలోకి దింపారు చంద్రబాబు.
..తాళిబొట్లు తెంపే నర రూప రాక్షసులను మళ్లీ ఎన్నుకుందామా?
పేరుమోసిన..కేశినేని నాని
ప్రైవేటు ట్రాన్ప్‌పోర్టు సర్వీసుల వ్యవహారంలో రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంను దుర్భాషలాడారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. అడ్డుకున్న కానిస్టేబుళ్లపై దాడికీ తెగబడ్డారు. అడ్డగోలు మాటలతో, అహంభావంతో ఊగిపోయారు. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ బరిలో దిగారు.
.. ఇలాంటి రాజకీయ వ్యాపారులను నమ్మి వారి ప్రయోజనాలకు పావులవుదామా?
గూండా నంబర్ వన్
స్వాతంత్య్ర సమర యోధుడి భూమి కబ్జా, అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను ‘రేయ్’ అంటూ సంభోదన, మహిళ ఇంటిని కాజేసే కుట్ర, బ్రాహ్మణ వైద్యుడిపై దాడి... ఇవన్నీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా గూండాగిరీ నిదర్శనాలు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను దుర్భాషలాడిన వ్యవహారంలోనూ బొండా ఉమా పాత్రధారి. ఈ గూండా గిరీ నచ్చిందేమో... మళ్లీ పోటీకి పెట్టారు.
...సంస్కారం లేని ఇలాంటివారిని కొనసాగిద్దామా?
అరాచకపతి... యరపతినేని
రాజకీయ ప్రత్యర్థులతో పాటు, అడ్డొచ్చినవారిని అధికారం అండగా, పోలీసుల ద్వారా వేధింపులకు గురిచేయడంలో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది ఘన చరిత్ర. గనుల అక్రమ తవ్వక వ్యవహారంపై హైకోర్టులో కేసు వేసిన గురువాచారి అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. కోర్టులు ఎంత హెచ్చరించినా ఈయన అక్రమం ఆగలేదు. గతంలో హత్య కేసు నిందితుడైన యరపతినేని... ఫ్యాక్షన్ రాజకీయాలకూ పెట్టింది పేరు. ఈ అరాచక శక్తిని గురజాల నుంచి మరోసారి పోటీకి దించారు చంద్రబాబు.
..గనులను కొల్లగొట్టిన ఇలాంటి గజదొంగను గెలిపించి మన సహజ వనరులను మన చేతులతోనే నాశనం చేసుకుందామా?
స్కాం మంత్రి.. ప్రత్తిపాటి
రాజధాని భూములు, అగ్రి గోల్డ్, పత్తి కుంభకోణం ఇలా ఏ ప్రధాన స్కామ్ చూసినా కనిపించే పేరు ప్రత్తిపాటి పుల్లారావు. పత్తి స్కామ్‌లో లక్షలాది మంది రైతుల కడుపుకొట్టిన ఈ మంత్రి... మట్టి అక్రమ తరలింపులోనూ ముద్దాయే.ఈ వ్యవహారంలో విజిలెన్స్ నుంచి ఇబ్బందులు వస్తాయని వారిస్తే.. ‘విజిలెన్సా? బొచ్చా?’ అంటూ వ్యవస్థలను అపహాస్యం చేశారు. అగ్రిగోల్డ్ భూములను కాజేయడం ద్వారా తాను మంత్రి కాదు జగజ్జంత్రీనని చాటి చెప్పుకొన్నారు. చిలకలూరిపేటలో ఈయన సతీమణి వెంకాయమ్మ ట్యాక్స్ గురించి కథలు కథలుగా చెప్పుకొంటారు.
..వ్యవస్థలను గౌరవించని ఇలాంటి కుసంస్కారులను ఉపేక్షిద్దామా?
కబ్జా కోరు.. బండారు
అందాల విశాఖను చెరబట్టిన రాక్షసుల్లో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. భూ కబ్జాల్లో ఈయన రూటే సపరేటు. ఒకనాడు గురువునే మోసం చేసి బీఫారం తెచ్చుకుని రాజకీయ జీవితం ప్రారంభించిన బండారు... ఈ ఐదేళ్లలో కుమారుడితో కలెక్షన్లు మొదలుపెట్టారు. తన రాజకీయానికి అడ్డొస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేశారు. ఎకరా రూ.కోటి విలువైన ముదపాక గ్రామ రైతుల అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ అడ్డుపెట్టుకుని రూ.పది లక్షలకే కాజేసే వ్యూహం పన్నారు. ఇటీవల భూ కబ్జాకు అడ్డొచ్చిన దళిత మహిళను అనుచరుల ద్వారా వివస్త్రను చేయించి చితకబాదించారు. అయినా, కించిత్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. మళ్లీ పెందుర్తిలో పోటీకి దిగారు.
.. పేద రైతుల పొట్ట కొట్టిన ఈ కామందులను నెత్తికెత్తుకుందామా?
మద్యం మాఫియా మాయావి.. వెలగపూడి రామకృష్ణ
సొంత ఊరిలో హత్యాకాండకు తెగబడి... అక్కడినుంచి పారిపోయి విశాఖపట్నం చేరారు స్థానిక తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చేది విజయవాడలో జరిగిన వంగవీటి రంగా దారుణ హత్య. ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హతమార్చిన బృందంలో వెలగపూడి నిందితుడు. రంగాపై కత్తులతో దాడి చేసినవారిలో ఈయనా ఉన్నారని పోలీసులు కేసు పెట్టడం గమనార్హం. ఆ కేసులో 27వ నిందితుడు వెలగపూడి. అనంతరం విశాఖ వెళ్లిపోయి మద్యం దందాలతో బలపడ్డారు. ప్రశాంత నగరంలో మద్యం మాఫియాకు ఈయనే బాస్. ఎమ్మెల్యే అయ్యాక ఈయన నేతృత్వంలో టీడీపీ వారు సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు.
..రక్తపు చేతులతో వచ్చి, రక్తమాంసాలను పీల్చే మద్యం ముఠా కట్టి జనం సొమ్ము కొల్లగొడుతున్న కుహనా నేతను ఇంకా సహిద్దామా?
కన్నూమిన్ను కానని కూన రవికుమార్
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులు, అధికారులే కాదు... సామాన్యులూ హడలిపోయే పేరు కూన రవికుమార్. ఎన్నికైనది 2014లోనే అయినా... ఆగడాల్లో సీనియర్లను ఆదర్శంగా తీసుకున్నారు. ఎమ్మెల్యే గిరీ రాగానే ఇసుక మాఫియాకు బాస్‌గా మారారు. వంశధార నది నుంచి రోజూ వందల లారీల్లో విశాఖపట్నం తరలే ఇసుక అక్రమ రవాణాకు రవికుమారే సారథి. మాట వినని అధికారులు, ఉద్యోగులను ఇంటికి పిలిపించి మరీ తనదైన శైలిలో హెచ్చరించి పంపుతారు. ఈయన్నుంచి ఫోన్ వచ్చిందంటే అధికారులు హడలిపోవాల్సిందే. ఈ అక్రమాలను ప్రశ్నిస్తున్న ఎంతోమందిపై తన వర్గీయులతో దాడి చేయించారు. గంగిరెడ్ల శివ అనే యువకుడికి స్వయంగా ఫోన్ చేసి దుర్భాషలాడటమే కాక, ఏకంగా చంపేస్తానని బెదిరించడం జిల్లాలో సంచలనమైంది.
ఈ తలబిరుసు, నోటి దురుసు కూనలకు గెలుపనే పాలు పోసి కాటేయించుకుందామా?
అచ్చోసిన.. అచ్చెన్నాయుడు
ప్రతిపక్షంపై పెద్ద నోరేసుకుని మాట్లాడే మంత్రి అచ్చెన్నాయుడు... నిజంగా ఈ ఐదేళ్లలో అచ్చోసినట్లే ప్రవర్తించారు. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళా ఉద్యోగిపై దాడికి తెగబడ్డారు. ఈ వ్యవహారంపై ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈయన అఘాయిత్యాలకు జడిసి ఓ ఉన్నతాధికారి రాష్ట్రమే విడిచి వెళ్లిందంటారు. టెక్కలి నియోజకవర్గంలో పలువురు అధికారులను చాలా సందర్భాల్లో దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడ్డారు. చంద్రబాబు టెక్కలి నుంచి మరో సారి బరిలోకి దించారు.
..ఇలాంటి అచ్చోసిన నేతల ఆగడాలను భరిద్దామా?
ఎందుకోయి... ఈ కేఈ
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటూ, నియోజకవర్గంలో ప్రబల నాయకుడిగా ఎదుగుతున్న చెరుకులపాడు నారాయణరెడ్డిని అతి కిరాతకంగా చంపించాడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు. అతడిని ఈ కేసు నుంచి బయట పడేయడానికి స్వయంగా చంద్రబాబే తీవ్రంగా యత్నించారు. తండ్రి ప్రజాప్రతినిధి అయినా, నియోజకవర్గంలో అంతా తానే అయి నడిపించాడు శ్యాంబాబు. ప్రజలే కాదు.. సొంత పార్టీ కార్యకర్తలూ భయపడేలా వ్యవహరిస్తుంటారు. అలాంటి వాడిని ఏకంగా పత్తికొండ నుంచి బరిలో దించారు.
...తెరవెనుక ఉండే పీకలు కోసిన ఇలాంటివారిని రాజకీయ తెరపైకి ఆహ్వానిద్దామా?
కర్కశుడు..కురుగుండ్ల రామకృష్ణ
లక్షలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ముడిపడినందున సాధారణంగా రైల్వే శాఖ కాంట్రాక్టులు; వ్యవహారాలు క్రమ పద్ధతిలో సాగుతుంటాయి. అలాంటి చోట కూడా తన వాటా తనకు కావాలంటూ బెదిరింపులకు దిగారు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. శ్రీకాళహస్తి– నడికుడి రైలు మార్గం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వకపోవడంతో కిడ్నాప్ చేసి చితకబాదారు. ఆయన బెదిరింపులు ఏ స్థాయిలో ఉంటాయో మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గంలో తహసీల్దార్లు, ఇంజనీర్లపై పలు సందర్భాల్లో దాడులకు తెగబడ్డారు. అయినా మరోసారి బరిలో దించారు.
..బరితెగించిన ఇలాంటివారిని మళ్లీ చట్టసభ మెట్లెక్కిద్దామా?
పొలిటికల్ రౌడీ సోమిరెడ్డి
‘మేం చంపాలనుకుంటే కత్తితో గుచ్చడం, గిల్లడం చేస్తామా? ఏకంగా ఏసేయడమే...’ విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందన ఇది. టీడీపీ అసలు స్వభావాన్ని కళ్లకు కట్టిన ఈయనను ఎమ్మెల్సీని చేసి దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే పలుసార్లు ఓడినా... సర్వేపల్లి నుంచి మరో సారి బరిలోకి దించారు.
...ప్రజా బలం లేని ఈ తరహా మూకను ప్రోత్సహిద్దామా?
రాక్షస బల్లి.. బొల్లినేని రామారావు
నీటి పారుదల ప్రాజెక్టుల పనులు చేయకుండానే భారీఎత్తున ప్రజాధనం కొల్లగొట్టిన వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇదే బొల్లినేని ఇటీవల రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి తహసీల్దార్, ఆర్డీవోలను దుర్భాషలాడుతూ దాడులకు తెగబడ్డారు. అయినా మరోసారి పోటీకి దించడం ద్వారా చంద్రబాబు తన వ్యవహార శైలిని చాటుకున్నారు.
...ఇలాంట మోసగాళ్లను భుజాలపై మోసి మన గౌరవం మనమే తగ్గించుకుందామా?
అరాచకుడు... ఎస్‌వీఎస్ వర్మ
అరాచకాలు.. దాష్టీకాలు.. దౌర్జన్యాలకు పేరుగాంచారు ఎస్‌వీఎస్ వర్మ. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులపైనే దాడికి తెగబడ్డారు. పలువురు ప్రభుత్వ అధికారులను బెదిరించారు. ఈ అరాచక శక్తిని అక్కున చేర్చుకున్న చంద్రబాబు పిఠాపురం నుంచి పోటీకి దించారు.
...అల్ప జీవుల కడుపుకొట్టే అహంకారి మనకు అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment