జేసీ బ్రదర్స్
సాక్షి టాస్క్‌ఫోర్స్: పెద్దపప్పూరు మండలంలో జేసీ సోదరులకు ఎదురుగాలి వీస్తోంది. దేవునిఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరు గ్రామాల్లో మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ముఖ్య నాయకులు కూడా ముఖం చాటేసి ఇంట్లో లేకుండా వెళ్లిపోవడంతో ప్రచారాన్ని తూతూ మంత్రంగా ముగించాల్సి వచ్చింది. ఇది జేసీ సోదరుల్లో అలజడి రేపింది. దీనికితోడు జేసీ సొంత గ్రామమైన జూటూరులో బలమైన యర్రగుడి వర్గం ఆదివారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీపార్టీలో చేరిపోయింది.
దీంతో కంగారు పడిపోయిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రహస్య పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గతంలో టీడీపీలో ఉండి ప్రసుత్తం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న నాయకులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ముఖం చాటేసి వెళ్లిపోతుండటంతో రాత్రివేళల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి దేవుని ఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరులో రహస్యంగా పర్యటించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆశలు చూపారని, వాళ్లు లొంగకపోవడంతో బెదిరింపులకు దిగారని సమాచారం. రెండు రోజుల్లో తమ దారికి రావాలని, లేకుంటే తాము గెలిస్తే ఊర్లో లేకుండా చేస్తామని హెచ్చరికలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈసారి పెద్దారెడ్డి చేతిలో ఓటమి తప్పదని గ్రహించిన జేసీ సోదరులు తాటాకు చప్పుళ్లు చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment