peddapappuru
-
గెలిస్తే ఊర్లో లేకుండా చేస్తాం : జేసీ బ్రదర్స్
సాక్షి టాస్క్‌ఫోర్స్: పెద్దపప్పూరు మండలంలో జేసీ సోదరులకు ఎదురుగాలి వీస్తోంది. దేవునిఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరు గ్రామాల్లో మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ముఖ్య నాయకులు కూడా ముఖం చాటేసి ఇంట్లో లేకుండా వెళ్లిపోవడంతో ప్రచారాన్ని తూతూ మంత్రంగా ముగించాల్సి వచ్చింది. ఇది జేసీ సోదరుల్లో అలజడి రేపింది. దీనికితోడు జేసీ సొంత గ్రామమైన జూటూరులో బలమైన యర్రగుడి వర్గం ఆదివారం ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీపార్టీలో చేరిపోయింది. దీంతో కంగారు పడిపోయిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రహస్య పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గతంలో టీడీపీలో ఉండి ప్రసుత్తం వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న నాయకులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ముఖం చాటేసి వెళ్లిపోతుండటంతో రాత్రివేళల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి దేవుని ఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరులో రహస్యంగా పర్యటించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆశలు చూపారని, వాళ్లు లొంగకపోవడంతో బెదిరింపులకు దిగారని సమాచారం. రెండు రోజుల్లో తమ దారికి రావాలని, లేకుంటే తాము గెలిస్తే ఊర్లో లేకుండా చేస్తామని హెచ్చరికలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈసారి పెద్దారెడ్డి చేతిలో ఓటమి తప్పదని గ్రహించిన జేసీ సోదరులు తాటాకు చప్పుళ్లు చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. -
మందు బాబుల వీరంగం
= యువకుడి పరిస్థితి విషమం పెద్దపప్పూరు(తాడిపత్రి): పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో మందు బాబులు మంగళవారం వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ శ్రీహర్ష కథనం మేరకు... గ్రామానికి చెందిన నారాయణస్వామి, చంద్రశేఖర్ ఇళ్లు పక్కపక్కనే కాగా, తన మిత్రులు గౌడ్, సుధాకర్‌రెడ్డితో కలసి నారాయణస్వామి తన ఇంటి వద్ద మందు తాగుతూ అల్లరి చేస్తున్నట్లుతెలిపారరు. దీంతో అభ్యంతరం తెలిపిన చంద్రశేఖర్ సహా అతని అన్న రాముపై మందుబాబులు దాడికి దిగారు. సుధాకర్‌రెడ్డి చంద్రశేఖర్‌ను కట్టెతో తలపై బాదడంతో తీవ్ర గాయమైం, రక్తస్రావమైంది. దీంతో అతను అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఓ ప్రైవేటు వాహనంలో తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఈ ఉదంతంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గరు మహిళలు, మరో ముగ్గరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా దర్బార్
పెద్దపప్పూరు, న్యూస్‌లైన్ : వైశాల్యంలో అనంతపురం జిల్లా పెద్దదని, సరిహద్దు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక్క రోజు తానే ఏదో ఒక మండల కేంద్రానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. శనివారం పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ముచ్చుకోట పోలీస్‌స్టేషన్‌లో ప్రజల చెంతకే పోలీసులు అనే నినాదంతో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చాలా చిన్న సమస్యలు కూడా పరిష్కరించకపోతే అవి జఠిలంగా మారే ప్రమాదం ఉందన్నారు. పోలీస్ హెల్ప్‌లైన్-100కి రోజూ దాదాపు 70 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే చోట బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు, ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, బుక్కరాయసముద్రం, పామిడి మండలాలకు చెందిన 100 మందికి పైగా అర్జీలు ఇచ్చారు. రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువ అర్జీలు రావడం విశేషం. ప్రజలు ఇచ్చిన అర్జీలను తహశీల్దార్ రమాదేవికి అప్పజెప్పారు. మరికొన్నింటిని సంబంధిత మండలాల ఎస్ఐలకు అప్పగించి, విచారణ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, డీఎస్పీ నాగరాజు, సీఐలు లక్ష్మీనారాయణ, రాఘవన్, తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యల్లనూరు, పామిడి, పుట్లూరు ఎస్ఐలు పాల్గొన్నారు.