సాక్షి వెబ్ ప్రత్యేకం : గత కొద్ది రోజులుగా ఉత్కంఠ కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో ఒక్కసారిగా వేడెక్కాయి. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను తొలి విడతలోనే నిర్వహిస్తున్నట్టు ఈసీ చేసిన ప్రకటన ఆయా రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించిన ఈ రోజు (ఆదివారం 10 మార్చి) నుంచి సరిగ్గా నెల రోజుల్లో ఏపీలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తవుతుంది. అంటే, ఆయా రాజకీయ పార్టీలు ఏం చేసిన ఈ నెల రోజుల్లోనే తేల్చుకోవాలి. అయితే, ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల కసరత్తును ప్రారంభించినప్పటికీ మరో వారం రోజుల్లో అంటే 18వ తేదీ సోమవారం నుంచి ఏకంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యం మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చదవండి....(ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్)
కేవలం నెల రోజుల మాత్రమే గడువు లభించడమన్నది ఏ రాజకీయ పార్టీకి నష్టం? ఎవరికి లాభం? అన్న అంశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో సమాలోచనలు, చర్చోపచర్చలు మొదలయ్యాయి. తాజా షెడ్యూలు ప్రకారం ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రచారం నిర్వహించడం వంటి ప్రణాళికలను మరింత వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఆయా పార్టీలకు ఏర్పడింది. అయితే, ప్రచారం విషయంలో మిగతా పార్టీలకన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి అనుకూలంగా మారింది. ఎందుకంటే గత ఏడాది కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో ఆయన ప్రజల్లోనే ఉన్నారు. దానికి తోడు అనేక బహిరంగ సభల్లో ఇప్పటికే ప్రసంగించారు. పార్టీ లక్ష్యాలను ఆశయాలను ప్రతి సభలో వివరిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఈ విషయంలో ప్రత్యర్థి టీడీపీ చాలా వెనుకబడి ఉన్నదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. దానికి తోడు నాలుగేళ్ల కాలంలోని అనేక వైఫల్యాలు మరింత ప్రతికూలంగా పరిణమించినట్టు చెబుతున్నారు.
ఇకపోతే, అభ్యర్థుల ఎంపిక కూడా టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిస్తోంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకోగా, ఇప్పుడు అలాంటి స్థానాల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంలో తీవ్ర అసంతృప్తులు, అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయా జిల్లాల నుంచి నాయకులు పెద్దఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ రకంగా నేతల చేరిక కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఉత్సాహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది. ఈ పరిణామాలు అధికారంలో ఉన్న పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారినట్టు విశ్లేషిస్తున్నారు. విచిత్రమేమంటే, కొన్ని లోక్ సభ స్థానాలకు సరైన అభ్యర్థులు కూడా లేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్న పార్టీలకు కూడా తాజా షెడ్యూలు ప్రతికూలంగా మారుతోందని భావిస్తున్నారు.
టీడీపీ ఇప్పటికీ కాంగ్రెస్, జనసేన వంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని తెర వెనుక తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోగా, టీడీపీ కుదుర్చుకోబోయే పొత్తుల వల్ల అనేక నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేతల్లో భయాందోళనలు నెలకొన్నట్టుతెలుస్తోంది. పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కొనడానికి చంద్రబాబు సిద్ధంగా లేకపోగా, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయగా, ఆ తర్వాత పరిణామాల్లో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో చెలిమి, ఇతర పార్టీలతో తెర వెనుక లాలూచీ వ్యవహారాలు ఏపీలో అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెడతాయని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయ ప్రభావం కూడా ఎంతో కొంత ఆయా పార్టీలపై ఉంటుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణ, ఏపీ వేర్వేరుగా రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా, దానిని అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీలో ఆర్థికంగా బలవంతులైన అనేక మంది అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఓటర్లను తరలించారు. ఈసారి ఒకేసారి పోలింగ్ జరుగుతున్న కారణంగా గతంలో ప్రయోగించిన ఎత్తుగడలకు ఈసారి అంతగా ఫలించకపోవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక రకంగా అది కూడా ప్రతికూలంగా పరిణమిస్తుందని చెబుతున్నారు.
నెలన్నర సస్పెన్స్
ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల కోసం ఈ నెల 18 వ తేదీ సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 18 వ తేదీ నుంచి ప్రారంభమై 25 వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 26 న నామినేషన్ల పరిశీలన, 28 న ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 11 వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి వీలులేనందున దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ మే 23 న నిర్వహిస్తారు. అంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్న విషయం పోలింగ్ అనంతరం మరో నెలన్నర రోజుల పాటు సస్పెన్స్ భరించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment