అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 10న నిర్వహిస్తామన్న మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ మీటింగ్‌ను 14 (మంగళవారం)న నిర్వహిస్తామని సీఎంవో వెల్లడించింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు పంపించామని తెలిపింది. ఫొని తుపాన్, కరువు, నరేగా (జాతీయ ఉపాధి హామీ పథకం) కూలీలకు నిధుల విడుదలపై తలెత్తిన అడ్డంకులపై చర్చ మొదలగు అంశాలను అజెండాలో చేర్చామని పేర్కొంది. కాగా, సీఎంవో ఇచ్చిన అజెండా ప్రకారం ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ అజెండాను పరిశీలించి ఈసీకి పంపనుంది.
ఇక ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని సీఎస్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం కోరుతోందని, ఈ విషయంలో సీఎం అభిప్రాయం తీసుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment