
ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ సర్కిల్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్న అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ
తాడిపత్రి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరిరోజు పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. పోలీసులు అధికారపార్టీ ఎన్నికల ప్రచారానికి అనుమతిచ్చిన పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు విధించారు. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక గాంధీ సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అసలేం జరిగింది..
ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగియనుండడంతో టీడీపీకి చెందిన నాయకులు మధ్యాహ్న సమయంలో పట్టణంలోని పోలీస్‌స్టేషన్ నుంచి ఆశోక్‌పిల్లర్ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా సీబీ రోడ్డు మీదుగా తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సీబీ రోడ్డు మీదుగా వస్తున్న వైఎస్సార్‌సీపీ నేతల ప్రచారాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు తమకు ఇంకా గడువు ఉందని గడువులోపు ప్రచారాన్ని పూర్తీ చేసుకుని వెళుతామని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు తెలిపారు.
ఇందుకు పోలీసులు సీబీ రోడ్డులో ప్రచారానికి వెళ్ళడానికి వీలులేదని పుట్లూరురోడ్డు గుండా వెళ్లాలని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ససేమిరా అన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు సుమారు అరగంటపాటు స్థానిక పోలీస్‌స్టేషన్ సర్కిల్‌లో ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న అడిషన్ ఎస్పీ చౌడేశ్వరీ అనంతపురం నుండి హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. ఆర్టీసి బస్టాండ్ వరకు ప్రచారం నిర్వహించడానికి వీలులేదని ఆలోపు గడువు ముగుస్తుందని దీంతో పుట్లూరు రోడ్డు మీదుగా ప్రచారం నిర్వహించి ముగించాలని అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ వైఎస్సార్‌సీపీ నేతలకు తేల్చి చెప్పారు.
దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక స్టేషన్ సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో పుట్లూరు రోడ్డు మీదుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పుట్లూరు రోడ్డు నుండి క్రిష్ణాపురం జీరో రోడ్డు గుండా యల్లనూరు రోడ్డులోకి ప్రవేశించే సమయంలో పోలీసులు అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్నారు. తిరిగి పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల బందోబస్తు మధ్య క్రిష్ణాపురం జీరో నుండి యల్లనూరు రోడ్డు సర్కిల్ వరకు ప్రచారాన్ని సాగించారు. ఇంతలోనే ప్రచారం గడువు ముగియడంతో నాయకులు వెనుతిరిగి వెళ్ళారు.
Comments
Please login to add a commentAdd a comment