♦ ఆత్మకూరు మండలంలో అరాచకం
ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. సనపలో వైఎస్సార్‌సీపీకి అధికంగా ఓట్లు పడుతున్నాయన్న అక్కసుతో టీడీపీ నాయకులు ఓటర్లపై దాడులకు తెగబడ్డారు. అంతేకాదు ఈవీఎంలను పగులగొట్టారు. పోలింగ్ ఆపడం కోసం ఓటర్లపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు కలగజేసుకుని, గొడవను సద్దుమణిగించారు. జిల్లా కేంద్రం నుంచి ఈవీఎంలను తెప్పించి తిరిగి పోలింగ్ కొనసాగించారు. సిద్దరాంపురంలో అంధుడికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తితో టీడీపీ నాయకులు వాగ్వాదం చేశారు.
ఓటరే బటన్ నొక్కాలని, మీరు సహాయం చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కట్టెలు, రాళ్లతో మహిళలపైన, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడి చేశారు. దాడిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాలపోనత్న, నాయకులు శ్రీరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళను పక్కకు నెట్టేయడంతో ఆమె గాయపడింది. దీంతో అక్కడ పోలింగ్ నిలిపివేసి.. గ్రామస్తులు ధర్నా చేశారు. బాలపోతన్న తన ప్రాణం పోయినా సరే పోలింగ్ జరగాలని, అంతవరకూ ఆస్పత్రికి వెళ్లనని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు దగ్గరుండి మరీ పోలింగ్‌ను కొనసాగించారు.
♦ వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి
కళ్యాణదుర్గం: పోలింగ్ బూత్‌ల వద్ద ఎన్నికల నియమావళి పాటించాలని సూచించినందుకు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడిన ఘటన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎన్నికల నిబంధనలను పాటించడం లేదని భాస్కర్‌రెడ్డి ప్రశ్నించడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జయప్ప, బాబన్న, గోవిందప్ప, బొజ్జన్నతో పాటు మరికొంత మంది మూకుమ్మడిగా దాడి చేశారు. వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్న అక్కసుతో రెచ్చిపోయారు. దాడిలో భాస్కర్‌రెడ్డికి గాయాలయ్యాయి.
దాడి చేయడం ఎంత వరకు సమంజసమని అక్కడే ఉన్న మరికొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకులు గూబనపల్లి నాగరాజు, నారాయణ, చిట్టిబాబు, ఓబన్న, నాగరాజు, తిప్పేస్వామిలు నిలదీశారు. ఈ సందర్భంలో తోపులాట, వాగ్వాదం జరిగింది. భాస్కర్‌రెడ్డితో పాటు ఉమేష్ బాబు, తిప్పేస్వామి, జయన్న, ఆంజినేయులకు స్వల్ప గాయాలయ్యాయి. డీఎస్పీ మల్లికార్జున సంఘటన స్థలం వద్దకు చేరుకోవడంతో టీడీపీ దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. ఇదే సందర్భంలో సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పోలీసుల తీరును తప్పుబట్టారు. దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
♦ ఈవీఎంను పగులగొట్టిన కొట్రికె
గుత్తి: గుత్తిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా గురువారం పోలింగ్ బూత్‌లో అరాచకం సృష్టించారు. గుప్తా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 183 పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల బోర్డు పెట్టలేదని అంటే రాయలేదని పోలింగ్, పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంతో ఊగిపోయి ఈవీఎంను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. సీఐ ప్రభాకర్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొట్రికె మధుసూదన్ గుప్తాను అరెస్టు చేశారు. 353, 188, ఆర్పీ యాక్ట్‌లపై కేసు నమోదు చేశారు.
♦ గుండుమలలో రిగ్గింగ్
మడకశిర: మడకశిర మండలం గుండుమలలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని గ్రహించిన టీడీపీ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇందుకు పీఓ కూడా తనవంతు సహకారమందించారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ జనరల్ ఏజెంట్ డాక్టర్ స్వామిదినేష్ అక్కడ జరుగుతున్న రిగ్గింగ్‌ను చూసి అధికారులను ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ జనరల్ ఏజెంట్ డాక్టర్ స్వామిదినేష్‌పై దాడి చేసి, పోలింగ్ కేంద్రం నుంచి గెంటేశారు.
స్వామి దినేష్ కారుపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. విషయం తెలియగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి, ఏడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ రామకృష్ణ, బూత్ కమిటీ మేనేజర్ వెంకటరంగారెడ్డి తదితరులు ఆర్‌ఓ ఎం.గాంధీని కలిసి, రిగ్గింగ్‌ను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. గుండుమలలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు మడకశిరలో డీఎస్పీ అంకయ్యను కలిసి టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. జక్కేపల్లిలోనూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటికి పంపారని డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఉగ్రేపల్లిలో కూడా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment