సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గంగా ఆళ్లగడ్డకు పేరుంది. 90 శాతం పల్లె ఓటర్లున్న ఈ నియోజకవర్గానికి తూర్పున తెలుగు గంగ, పడమర కేసీ కెనాల్ ప్రవహిస్తున్నాయి. 1953లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఆళ్లగడ్డ ప్రాంతం కోవెలకుంట నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1955లో శిరివెళ్లగా మారింది. 1962లో ఆళ్లగడ్డ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి, రుద్రవరం, గోసుపాడు మండలాలు దీని పరిధిలో ఉండేవి. అప్పట్లో దీనిని ఎస్సీలకు రిజర్వు చేశారు. 1967లో జనరల్ కేటగిరీకి మార్చారు.
2009 నియోజకవర్గాల పునర్విభజనలో గోసుపాడు మండలాన్ని నంద్యాల నియోజకవర్గంలో కలపగా అంతవరకు కోవెలకుంట నియోజకవర్గంలో ఉన్న ఉయ్యలవాడ, దొర్నిపాడు మండలాలను ఆళ్లగడ్డలో కలిపారు. 2014లో ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా శోభనాగిరెడ్డి పోలింగ్ ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలింగ్‌ను యధాతథంగా నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డిపై శోభనాగిరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలోకి ఫిరాయించారు.
మూడు కుటుంబాల మధ్యే..
1967 నుంచి ఇప్పటివరకు గంగుల కుటుంబానికి, వారి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్వీ, భూమా కుటుంబాలకు మధ్యే రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు, ఆయన మేనల్లుడు భూమా శేఖర్‌రెడ్డి ఒకసారి, ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి రెండుసార్లు, ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఐదుసార్లు, వారి కూతురు అఖిలప్రియ ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
1967లో గంగుల కుటుంబం నుంచి మొదటిసారి తిమ్మారెడ్డి పోటీ చేయగా.. ఎస్వీ కుటుంబం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి తలపడ్డారు. ఆ తరువాత తిమ్మారెడ్డి కొడుకు గంగుల ప్రతాపరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు శోభానాగిరెడ్డి పోటీ పడ్డారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గంగుల తిమ్మారెడ్డి మనుమడు గంగుల బిజేంద్రారెడ్డి, టీడీపీ తరఫున ఎస్వీ సుబ్బారెడ్డి మనుమరాలు అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. వీరు మూడో తరానికి చెందిన వారు.
అఖిలప్రియకు ఎదురీత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ ఎవరితోనూ చర్చించకుండా వెంటనే పార్టీ ఫిరాయించడం, రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం పెట్టినట్టు ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పార్టీ మారిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు ఆ పదవి ఇవ్వకుండా అవమానాల పాలు చేయడంతో మానసిక వేదనతో నాగిరెడ్డి మృతి చెందారు. ఆ తరువాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది.
ఆమె ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. తనచుట్టూ ఉన్న ముగ్గురు, నలుగుర్ని తప్ప.. ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆస్తి, ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. ఆర్ అండ్ బీ రోడ్లు, నీరు–చెట్టు పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఆ నలుగురే పంచుకుని రూ.వందల కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారనే అపప్రద ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అఖిలప్రియ అభ్యర్థిత్వంపై అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోను వ్యతిరేకత ఉంది. దీనికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాకపోవడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చే అంశం.
అమలు కాని హామీలు
నియోజకవర్గానికి ఆయువుపట్టు అయిన కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో పంట కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ ఆయకట్టుకు ఏమాత్రం నీరు చేరడంలేదు. ప్రధాన కాలువల మరమ్మతులతోపాటు పంట కాలువల నిర్మాణం చేపడతామన్న హామీ నెరవేర్చలేదు. ఆళ్లగడ్డలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కలగానే ఉంది. అహోబిలంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.
ఫ్యాన్ జోరు
నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరుల అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మూడేళ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిలకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన మంత్రి అఖిలప్రియ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతాంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో బిజేంద్రారెడ్డికి పట్టం కట్టడానికి నియోజకవర్గ ఓటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి ఘన విజయం నమోదు చేయటం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. – బీవీ కృష్ణయ్య, సాక్షి, ఆళ్లగడ్డ
Comments
Please login to add a commentAdd a comment