bhuma akhla priya
-
మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ(నంద్యాల): తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి ముందు బంధువులంతా ఎకమై నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి ఉన్న కాలంలో బంధువుల వద్ద సుమారు రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత అప్పులు చెల్లించాలని వారసురాలైన అఖిలప్రియను అడుగుతుంటే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి అందరూ కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. అప్పులు తిరిగి చెల్లించాలని గొడవపడ్డారు. మీకు ఎలాంటి బాకీ లేనని, తాను ఏమైనా రాసిచ్చిన పత్రాలు ఉంటే చూపాలని అఖిలప్రియ అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు మధ్యవర్తులు బంధువులను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం మరి కొందరు బంధువులు తోడై అందరూ కలిసి అఖిలప్రియ ఇంటి మీదకు వెళ్లడంతో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి అక్కడికి చేరుకొని అఖిలప్రియ బంధువులకు సర్దిచెప్పారు. అయినప్పటికీ, బాధితులు అఖిలప్రియ ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు. -
పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమోకానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. -
అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. హఫీజ్‌పేటలో ప్రవీణ్‌రావు 2016లో ఖరీదు చేసిన 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించారు. అప్పట్లోనే ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని ప్రవీణ్‌రావు చెల్లించారు. ఇటీవల ఆ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తమకు అప్పట్లో ఇచ్చిన మొత్తం చాలదని, భారీ మొత్తం చెల్లించాలని, లేదంటే ఆ భూమిలో వాటా కావాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గరామ్ కలసి ప్రవీణ్‌రావుపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా నెరవేర్చుకోవడానికే గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్ తదితరులతో కలసి మంగళవారం రాత్రి బాధితుల్ని కిడ్నాప్ చేయించారు. ఈ క్రమంలో చిలుకూరులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నిర్బంధించి సెటిల్మెంట్ చేసుకో వాలని బెదిరిస్తూ కర్రలతో వారిపై దాడి చేశారు. ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించు కున్నారు. ఈ కిడ్నాపులకు సంబంధించిన వార్త మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేగిందని, పోలీసుల వేట ముమ్మరం కావడంతో అఖిలప్రియ తదితరులు అప్రమత్తమయ్యారు. ఆమె సూచన మేరకు ప్రవీణ్, సునీల్, నవీన్‌లను మెహిదీపట్నం సన్‌సిటీ సమీపంలోని కాళీమాత దేవాలయం వద్ద వదిలి వెళ్లారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకు బడి ఉన్న నేత కావడంతో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు కోర్టుకు నివేదిం చారు. దర్యాప్తునకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.(చదవండి: బెంగళూరులో ఏ-3 భార్గవరామ్?) అరెస్టు చేయకపోతే... పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్రామ్కు నేరచరిత్ర ఉందని, అఖిలప్రియను అరెస్టు చేయకపోతే ఇద్దరూ కలిసి నేరాలు కొనసాగించవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అనేక మంది నిందితులు పరారీలో ఉన్నారని కోర్టుకు తెలిపారు. బాధితులతోపాటు వారి కుటుంబీకులపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్ని అరెస్టు చేయడం ద్వారా బాధితులకురక్షణ కల్పించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. భార్గవ్‌రామ్‌తోపాటు ఇతర నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవ్‌రామ్ ఉన్నాడని అనుమానిస్తున్న పోలీసులు ఓ టీమ్‌ను అక్కడకు పంపారు. 6 నెలల క్రితమే పథకం! కాగా ప్రవీణ్ రావు తదితరుల్ని కిడ్నాప్ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్ ప్లేట్‌తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. -
కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో ఏ1 గా ఆరోపణలు ఎందుర్కొంటున్న ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని మాదాపూర్‌లోని అతని నివాసంలో హైదరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో అరెస్టయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఏ2 అఖిలప్రియ, భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రబోసును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఏ1 గా ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదు అంతకు ముందు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ‘కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమే. హఫీజ్‌పేట్ భూ వివాదంపై ఇప్పుడు నేను మాట్లాడలేను. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేయిస్తా. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. ఈ కేసు తో సంబంధం ఉంటే ఇప్పటికే నన్ను పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా?’అని ఏబీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: కిడ్నాప్ కేసు: ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి) -
ఆళ్లగడ్డ.. ఎవరికో అడ్డా
సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గంగా ఆళ్లగడ్డకు పేరుంది. 90 శాతం పల్లె ఓటర్లున్న ఈ నియోజకవర్గానికి తూర్పున తెలుగు గంగ, పడమర కేసీ కెనాల్ ప్రవహిస్తున్నాయి. 1953లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఆళ్లగడ్డ ప్రాంతం కోవెలకుంట నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1955లో శిరివెళ్లగా మారింది. 1962లో ఆళ్లగడ్డ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి, రుద్రవరం, గోసుపాడు మండలాలు దీని పరిధిలో ఉండేవి. అప్పట్లో దీనిని ఎస్సీలకు రిజర్వు చేశారు. 1967లో జనరల్ కేటగిరీకి మార్చారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో గోసుపాడు మండలాన్ని నంద్యాల నియోజకవర్గంలో కలపగా అంతవరకు కోవెలకుంట నియోజకవర్గంలో ఉన్న ఉయ్యలవాడ, దొర్నిపాడు మండలాలను ఆళ్లగడ్డలో కలిపారు. 2014లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా శోభనాగిరెడ్డి పోలింగ్ ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలింగ్‌ను యధాతథంగా నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డిపై శోభనాగిరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మూడు కుటుంబాల మధ్యే.. 1967 నుంచి ఇప్పటివరకు గంగుల కుటుంబానికి, వారి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్వీ, భూమా కుటుంబాలకు మధ్యే రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు, ఆయన మేనల్లుడు భూమా శేఖర్‌రెడ్డి ఒకసారి, ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి రెండుసార్లు, ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఐదుసార్లు, వారి కూతురు అఖిలప్రియ ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967లో గంగుల కుటుంబం నుంచి మొదటిసారి తిమ్మారెడ్డి పోటీ చేయగా.. ఎస్వీ కుటుంబం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి తలపడ్డారు. ఆ తరువాత తిమ్మారెడ్డి కొడుకు గంగుల ప్రతాపరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు శోభానాగిరెడ్డి పోటీ పడ్డారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గంగుల తిమ్మారెడ్డి మనుమడు గంగుల బిజేంద్రారెడ్డి, టీడీపీ తరఫున ఎస్వీ సుబ్బారెడ్డి మనుమరాలు అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. వీరు మూడో తరానికి చెందిన వారు. అఖిలప్రియకు ఎదురీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ ఎవరితోనూ చర్చించకుండా వెంటనే పార్టీ ఫిరాయించడం, రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్రెడ్డిని విమర్శించడం అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం పెట్టినట్టు ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పార్టీ మారిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు ఆ పదవి ఇవ్వకుండా అవమానాల పాలు చేయడంతో మానసిక వేదనతో నాగిరెడ్డి మృతి చెందారు. ఆ తరువాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది. ఆమె ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. తనచుట్టూ ఉన్న ముగ్గురు, నలుగుర్ని తప్ప.. ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆస్తి, ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. ఆర్ అండ్ బీ రోడ్లు, నీరు–చెట్టు పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఆ నలుగురే పంచుకుని రూ.వందల కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారనే అపప్రద ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అఖిలప్రియ అభ్యర్థిత్వంపై అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోను వ్యతిరేకత ఉంది. దీనికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాకపోవడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చే అంశం. అమలు కాని హామీలు నియోజకవర్గానికి ఆయువుపట్టు అయిన కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో పంట కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ ఆయకట్టుకు ఏమాత్రం నీరు చేరడంలేదు. ప్రధాన కాలువల మరమ్మతులతోపాటు పంట కాలువల నిర్మాణం చేపడతామన్న హామీ నెరవేర్చలేదు. ఆళ్లగడ్డలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కలగానే ఉంది. అహోబిలంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఫ్యాన్ జోరు నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరుల అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మూడేళ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిలకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన మంత్రి అఖిలప్రియ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతాంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో బిజేంద్రారెడ్డికి పట్టం కట్టడానికి నియోజకవర్గ ఓటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి ఘన విజయం నమోదు చేయటం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. – బీవీ కృష్ణయ్య, సాక్షి, ఆళ్లగడ్డ -
నా కొంగులో నా గుండెలో....
రాఘవ్, కరాణ్య కత్రీన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారి బాలరాజు’. కె.ఎండి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. చిన్నికృష్ణ–చిట్టిబాబు రెడ్డిపోగు స్వర పరచిన ఈ చిత్రంలోని ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే పాటను నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. ‘చెలియా నీ కోసం’ అనే మరో పాటను మంత్రి భూమా అఖిలప్రియ రిలీజ్ చేశారు. హీరో రాఘవ్ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారు మా చిన్న సినిమా పాటని పెద్దమనసుతో రిలీజ్ చేసి, మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘రాయలసీమలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథతో రూపొందిన చిత్రమిది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ‘దిల్’రాజుగారు, భూమా అఖిలప్రియగారు, బిజ్జం పార్థసారధిరెడ్డిగారు మా చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా : చక్రవర్తి. -
అఖిలప్రియ, తలసానిలను నియంత్రించండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భూమా అఖిలప్రియను, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా నియంత్రించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో గవర్నర్ నరసింహన్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రతివాదిగా ఉన్న ఈ వ్యాజ్యాలను విచారించడం సాధ్యం కాదంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్‌ను ప్రతివాదిగా చేయడానికి వీల్లేదని తెలిపింది. ప్రతివాదుల జాబితా నుంచి గవర్నర్ పేరును తొలగిస్తే ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది మల్లికార్జునశర్మ నిరాకరించడంతో, అసలు ఈ వ్యాజ్యాలకి నంబర్ కేటాయించడం, వ్యాజ్యాల విచారణార్హతపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా నియంత్రించాలని కోరుతూ న్యాయవాది గిన్నె మల్లేశ్వరరావు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారిలతో పాటు అఖిలప్రియ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో నంబర్ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారణ జరిపారు. గవర్నర్‌కు నోటీసు జారీ చేసే అధికారం తమకు లేదన్నారు. ఎందుకు గవర్నర్‌ను ప్రతివాదిగా ఉంచాలని పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ పేరును తొలగిస్తే ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతానన్నారు. అయితే ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది మల్లికార్జునశర్మ నిరాకరించారు. కోర్టే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలపై తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
చంద్రబాబు ప్రతిజ్ఞకు ముందే వెళ్లిపోయిన అఖిలప్రియ
కర్నూల/కాకినాడ: నంద్యాలలో మహా సంకల్ప దీక్షకు స్పందన కరువైంది. గురువారం చేయనున్న మహాసంకల్ప దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా హాల్‌తో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ చేయడానికి ముందే మంత్రి భూమా అఖిలప్రియ వెళ్లిపోయారు. మరోపక్క, కాకినాడలో చంద్రబాబునాయుడు సంకల్ప దీక్ష చేయించారు. ఈ దీక్షలో భాగంగా 2019నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఏడాదే పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.