సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భూమా అఖిలప్రియను, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా నియంత్రించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో గవర్నర్ నరసింహన్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రతివాదిగా ఉన్న ఈ వ్యాజ్యాలను విచారించడం సాధ్యం కాదంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నర్‌ను ప్రతివాదిగా చేయడానికి వీల్లేదని తెలిపింది. ప్రతివాదుల జాబితా నుంచి గవర్నర్ పేరును తొలగిస్తే ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
అయితే ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది మల్లికార్జునశర్మ నిరాకరించడంతో, అసలు ఈ వ్యాజ్యాలకి నంబర్ కేటాయించడం, వ్యాజ్యాల విచారణార్హతపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన భూమా అఖిలప్రియను, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా నియంత్రించాలని కోరుతూ న్యాయవాది గిన్నె మల్లేశ్వరరావు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారిలతో పాటు అఖిలప్రియ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను వ్యక్తిగత ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో నంబర్ ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం విచారణ జరిపారు.
గవర్నర్‌కు నోటీసు జారీ చేసే అధికారం తమకు లేదన్నారు. ఎందుకు గవర్నర్‌ను ప్రతివాదిగా ఉంచాలని పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ పేరును తొలగిస్తే ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతానన్నారు. అయితే ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది మల్లికార్జునశర్మ నిరాకరించారు. కోర్టే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలపై తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment