
నగర రాజకీయాల్లో తనదైన ముద్ర
తాజా పరిస్థితులపై పెదవి విప్పని వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తనదైన ముద్రతో వ్యవహరించే మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తరుణంలో పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యుల తర్వాత.. ముఖ్యంగా నగర రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో అన్నీ తానై వ్యవహరించే తలసాని దూకుడు వైఖరి గతంలో మాదిరిగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చురుగ్గా ఉన్నారని, స్థానిక సమస్యలు విన్నవించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం తన వద్దకు వచ్చే ప్రజలను కలుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా జరిగిన ధర్నా తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. బహుశా, ప్రత్యర్థి పార్టీలపై గతంలో మాదిరిగా తీవ్ర రాజకీయ విమర్శలు చేయకపోవడం వల్లే అయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ వ్యాఖ్యల ఆంతర్యమేమిటో?
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారు నగరానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు తానే వెళ్లడం తెలిసిందే. రాజకీయంగా ఎవరిౖపైనెనా వెరవకుండా విమర్శలు, ప్రతివిమర్శలు చేయడాన్ని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై సైతం గతంలో పరుష వ్యాఖ్యలు చేయడాన్ని నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు.
గతంలో మాదిరి దూకుడు లేకపోవడం వల్ల కావచ్చు వెలితిగా కనిపిస్తోందని అంటున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనందున అనవసర వివాదాల్లో తలదూర్చరాదనే తలంపుతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా ఎలాంటి విమర్శలు కానీ, ప్రతివిమర్శలు కానీ చేయడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలకు సంబంధించి సైతం ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. పైపెచ్చు పేదలకు ఉపకరించే కార్యక్రమాలు ఎవరు చేసినా తమ మద్దతు ఉంటుందని తన నియోజకవర్గంలో ఆయా కార్యక్రమాల ప్రారంభాల సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికలపైనా..
బీఆర్‌ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ తలసానికి ఇవ్వనున్నారనే ప్రచారం మొదలైనప్పటికీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానం పార్టీ మార్పు గురించీ ప్రతిస్పందించలేదు. బహుశా తాను కూడా గతంలో పార్టీ మారడం వల్ల అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
గత ఎన్నికల్లో ఆయన కొడుకు సాయికిరణ్‌కు టికెట్ కోసం ప్రయత్నించి, సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయననే రంగంలోకి దింపనున్నారా.. లేక తాను పోటీ చేసే యోచనలో ఉన్నారా అన్నదీ తెలియడం లేదు. అటు పోటీకి సంబంధించి కానీ, ఇటు రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కానీ తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తలసాని వ్యవహరిస్తున్న తాజా వైఖరికి కారణమేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment