సుచరితకు సువర్ణవకాశం! | Andhra Pradesh Home Minister Mekathoti Sucharitha Profile | Sakshi
Sakshi News home page

ఏపీ తొలి మహిళ హోం మంత్రిగా సుచరిత

Published Sat, Jun 8 2019 5:56 PM | Last Updated on Sat, Jun 8 2019 9:22 PM

Andhra Pradesh Home Minister Mekathoti Sucharitha Profile - Sakshi

సాక్షి, అమరావతి : మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ దేశ రాజకీయ చరిత్రలో ఎప్పడూ లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ప్రకటించి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన హోంశాఖను, ఉపముఖ్యమంత్రి పదవులను మహిళలకు కేటాయించి వారి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. హోంశాఖను మేకతోటి సుచరితకు కేటాయించగా, ఉపముఖ్యమంత్రి హోదాను పుష్పశ్రీవాణిలకు ఇచ్చి మరో రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత, తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి చరిత్రకెక్కనున్నారు.

(చదవండి : ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు)

తండ్రి బాటలోనే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల తర్వాత నాటి  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోం మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడిచారు. అనూహ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సుచరితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో రాజన్న రాజ్యం మళ్లీ తేస్తానని హామి ఇచ్చిన వైఎస్‌ జగన్‌.. సీఎం పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్‌ కంటే ఒక అడుగు ముందుకేసి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళకు కీలకమైన హోంశాఖ కేటాయించడం గొప్ప విషయమనే చెప్పాలి. 

(చదండి : ఏపీ మంత్రివర్గ పూర్తి వివరాలు)

వైఎస్సార్‌ ఎమ్మెల్యే చేస్తే.. జగన్‌ మంత్రిని చేశారు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలు చేపట్టనున్న సుచరిత.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్‌ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ మరణాంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి 16,781 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ వెంటనడుస్తూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన ఫలితంగా వైఎస్‌ జగన్‌ ఆమెకు మంత్రిగా అవకాశం కల్పిస్తూ హోంశాఖను అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement