మైకులకు రెస్టు లేదు. స్టేజీలకు విశ్రాంతి దొరకదు. వాహనాలు తీరుబడిగా ఒకచోట నిలపడానికి వీల్లేదు. రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఊరూవాడా ఉత్సవంలో పాల్గొన్నట్లు ఓటేశాయి. ఇప్పుడు మళ్లీ ఓటరుకు పని పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరోమారు తీర్పునివ్వాలంటూ ఎన్నికల సంఘం ప్రణాళికలు గీస్తోంది. అందుకోసం ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల సంఘం హుషారుతో సిక్కోలులో ఎలక్షన్ ఫీవర్ ఇంకాస్త పెరిగింది.
అరసవల్లి: రాష్ట్రంలో ఎన్నికల వేడి మరికాస్త రాజుకునేలా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగిసి పార్టీలు హమ్మయ్య అనుకుంటూనే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే పనిలో పనిగా మున్సి పాలిటీలు, కార్పొరేషన్‌లో ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందడుగు వేసింది. ఈ మేరకు వచ్చే నెల 1న ఓటర్ల తుదిజాబితాను ప్రచురణ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టైంది. వీటి నిర్వహణలో ముందడుగుగా ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించి మార్గదర్శకాలను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఆమదాలవలస, ఇచ్ఛాపు రం, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లోనూ ఎన్నికల సందడి కనిపించనుంది. అయితే పలు చోట్ల గ్రామాల విలీన వివాదాలు కోర్టుల్లో సాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక పాలనకు బదులుగా ఎన్నికలు నిర్వహిస్తారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది.
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓట ర్లనే ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొత్తగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు కూడా త్వరలో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని మున్సి పాల్టీల్లో బూత్ లెవల్ అధికారులు (బిఎల్‌వో) ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. ఓటర్ల జాబితా ప్రచురణ కాగానే వార్డులు, డివిజన్ల వారీగా కులగణన, రిజర్వేషన్ల ఖరారు తదితర చర్యలు చేపట్టనున్నారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
జిల్లాలో ‘స్థానిక’ పరిస్థితి ఇది
జిల్లాలో ‘స్థానిక’ ఎన్నికలకు త్వరలోనే ముహూర్తం సిద్ధం కానుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 23న తెలియనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 1143 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలను నిర్వహించేందుకు ఓ వైపు కసరత్తు ప్రారంభమై వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను ప్రచురణ చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం, మరోవైపు ‘పుర’ పోరుకు కూడా సన్నాహాలు చేస్తోంది. శ్రీకాకుళం కార్పొరేషన్, పలాస–కాశీబుగ్గ, ఇఛ్చాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీలు, రాజాం,పాలకొండ నగర పంచాయతీల్లో కూడా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 1న జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాల్టీలతో పాటు శ్రీకాకుళం కార్పొరేషన్ ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేసి ప్రచురణ ప్రకటన చేయాలని ఆదేశించింది.
అయితే శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామ పంచాయతీల ప్రతిపాదనతో పాటు రాజాం నగర పంచాయతీలో కూడా సమీప గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి అభ్యంతరాలు కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ వీటి విషయంలో తుది నిర్ణయం వెలువడలేదు. అయితే ఈ క్రమంలో విలీన ప్రాంత పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారికై జిల్లా పంచాయతీ అధికారులు ఓవైపు చర్యలు చేపట్టారు. విలీన గ్రామాల సమస్యల కారణంతోనే శ్రీకా>కుళంలో 2010 నుంచి, రాజాంలో 2005 నుంచి ఎన్నికలు జరగలేదు. రాజాంలో అయితే నగర పంచాయతీ ఏర్పాటైన 2005 నుంచి ఒక్కసారి కూడా పాలక సభ్యుల పాలనకు నోచుకోలేదు. దీంతో నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. మిగిలిన నాలుగు చోట్ల గత నాలుగున్నరేళ్ల క్రితం నుంచి ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతోంది. రానున్న జూలై 2వ తేదీతో ఇక్కడ పాలన ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment