
కమిషనర్‌తో చర్చిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్టుటూరు టౌన్ : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న దీక్ష ఎట్టకేలకు ఫలించింది. చిరు వ్యాపారులైన పేదలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించారు. గత ఐదు రోజులుగా ప్రొద్దుటూరు పాతబస్టాండులో చిరువ్యాపారులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి దీక్ష చేపట్టారు. అన్న క్యాంటిన్ ఏర్పాటు పేరుతో పాతబస్టాండ్‌లో ఉన్న రెండు మున్సిపల్ దుకాణాలను, బస్‌షెల్టర్‌ను అక్కడ వ్యాపారాలు చేస్తున్న 30 మందిని ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నెల రోజులుగా బెదిరిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లారు. మరల దుకాణాలను తొలగించాలంటూ కొలతలు వేసి భయాందోళనకు గురి చేశారు. దీనిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పాతబస్టాండ్‌కు వెళ్లి చిరువ్యాపారులకు అండగా నిలిచారు. వరదరాజులరెడ్డి చెప్పినట్లు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు.
ఐదు రోజుల క్రితం..
మున్సిపల్ కమిషనర్ ఐదు రోజులక్రితం పాతబస్టాండ్‌లో ఉన్న బస్‌షెల్టర్‌ను, దుకాణాలను తొలగించేందుకు పోలీసు బందోబస్తు కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం ఏడు గంటలకే చిరు వ్యాపారులతో కలిసి దీక్ష చేపట్టారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా యాభైఏళ్ల క్రితంనిర్మించిన బస్టాండును ఎలా తొలగిస్తారంటూ కమిషనర్‌ను నిలదీశారు. వ్యాపారులకు 24వ తేదీ నోటీసులు ఇచ్చి 9వ తేదీ ఇచ్చారంటూ ఎందుకు మోసం చేశారని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌కు ఫోన్ చేసి వివరించారు. బస్టాండుకు పది అడుగుల దూరంలో త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పక్కనే 75 సెంట్ల మున్సిపల్ స్థలం ఉందని అక్కడ అన్న క్యాంటిన్ కడితే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. పరిశీలిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. కమిషనర్ దీక్షా శిబిరానికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. రాత్రివేళ దుకాణాలను కూల్చబోమని హామీ ఇచ్చారు.
ఐదవ రోజుకు చేరిన దీక్ష: మంగళవారానికి దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్‌ఓ మునికృష్ణారెడ్డి, ఇతర శాఖల అ«ధికారులు వచ్చారు. జిల్లా కలెక్టర్ తమను పిలిపించి ఈ విషయాన్ని చర్చించారని చెప్పారు. చిరువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చెప్పినట్లు వివరించారు. మున్సిపల్ గదులను, బస్‌షెల్టర్‌ను తొలగించి అన్న క్యాంటిన్‌తోపాటు బస్‌షెల్టర్‌ను ఆధునికీకరిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులు తిరిగి వారి స్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాపారులతో మాట్లాడారు. ప్రభుత్వం మనకోసం ముందుకు వచ్చి సహకరిస్తామన్నప్పుడు మనం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అన్న క్యాంటిన్‌ను మొదలు పెట్టిన రోజు బస్‌షెల్టర్ ఆధునికీకరణ పనులు మొదలు పెడతారని, నెలలోపు ఆ రెండు పూర్తవుతాయని, తిరిగి మీరు యధాస్థానాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీంతో వ్యాపారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment