
మంత్రి జగదీశ్ రెడ్డి(పాత చిత్రం)
నల్గొండ: తెలంగాణాలో ఏ ఎన్నికలు జరిగినా అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఈ నెల 16న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే పార్లమెంటు స్థాయి సన్నాహక సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంఎల్‌ఏలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత, ఆయన మార్క్ పాలన దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాక్యానించారు.
ఈ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ ఢిల్లీలో శక్తిగా మారుతుందని అన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలతో యువతలో పార్టీ క్యాడర్‌లో జోష్ నెలకొన్నదని చెప్పారు. గులాబీ కార్యకర్తలను సైనికుల్లాగా కేటీఆర్ తయారు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం గులాబీ పార్టీ గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ వందేళ్లు నిలిచి, గెలిచేలా సీఎం కేసీఆర్ పునాదులు వేస్తున్నారని పొగిడారు. పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment